NTV Telugu Site icon

Chandrayaan-3: చరిత్ర సృష్టించిన భారత్‌.. చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ విజయవంతం

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో చరిత్రను సృష్టించింది. జాబిల్లి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండ్ అయింది. శాస్త్రవేత్తలు ఊహించిన మేరకే ల్యాండింగ్‌ ప్రక్రియ విజయవంతమైనట్లు తెలిసింది. చంద్రయాన్‌-3 ల్యాండింగ్ ప్రక్రియను యావత్‌ భారతావని ఉత్కంఠగా వేచిచూసింది.

Read Also: Chandrayaan 3 Live Updates: చంద్రయాన్‌ – 3 ల్యాండింగ్‌ విజయవంతం

చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారతదేశం నిలిచింది. చంద్రుని ఉపరితలాన్ని తాకిన నాలుగో దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌ నుంచి ప్రధాని మోడీ లైవ్‌ను వీక్షించారు. విక్రమ్ ల్యాండర్‌ విజయవంతంగా ల్యాండ్‌ అయిన వెంటనే శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. చంద్రయాన్‌-3 విజయంతో నా జీవితం ధన్యమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు.

ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.44కి ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇప్పటివరకూ అన్ని దశలనూ విజయవంతంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్‌-3 దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండింగ్‌ మాడ్యూల్‌ చంద్రుడిపై కాలుమోపడంతో ఈ ప్రక్రియ విజయవంతమైంది.

జాబిల్లిపై అదీ దక్షిణ ధ్రువంలో కాలు మోపడంతో.. చంద్రయాన్‌3 ప్రయోగం సక్సెస్ అయింది. చంద్రయాన్‌-2 ఫెయిల్యూర్‌ నుంచి నేర్చుకున్న పాఠంతో.. అలాంటి తప్పిదాలు లేకుంటే చంద్రయాన్‌-3ని పక్కాగా రూపొందించినట్లు ధీమా వ్యక్తం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా ల్యాండ్‌ కానీ దక్షిణ ధ్రువంపై భారత్ దిగి చరిత్రను సృష్టించింది. పదేహేనేళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని పరిశోధనల్లో కొత్త శ్వాస నింపిన భారత్.. ఎవరూ చేరలేని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేసి.. జాబిల్లి దక్షిణ ధ్రువ జాడల్ని ప్రపంచానికి చూపించింది.