NTV Telugu Site icon

SLBC: 19వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్.. రోబోలను వినియోగించేందుకు రంగం సిద్ధం

Slbc

Slbc

SLBC: SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన తర్వాత కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ 19వ రోజుకు చేరుకుంది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. GPR (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్), క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. చికుక్కున ఏడుమంది మృతదేహాల కోసం విస్తృత చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల ఉన్న ప్రమాదకర ప్రాంతాలను తవ్వేందుకు రోబోలను వినియోగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు హైదరాబాద్‌కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థ ప్రతినిధులు సహాయక చర్యల్లో రోబోల వినియోగంపై అధ్యయనం చేశారు. మంగళవారం రోబోలకు సంబంధించిన ఇన్‌స్టలేషన్ సామగ్రితో టన్నెల్ వద్దకు చేరుకుని మాస్టర్ రోబో, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను క్యాంపు కార్యాలయంలో సిద్ధం చేశారు.

Read Also: Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

బుధవారం ఉదయానికి మూడు ప్రత్యేక రోబోలు టన్నెల్‌కు చేరనున్నాయి. ఈ రోబోలు బురద తొలగించడం, మట్టిని తవ్వడం, ఇనుప సామగ్రిని కత్తిరించడం, రాళ్లను పగలగొట్టడం వంటి పనుల్లో సహాయపడతాయి. మట్టి, ఇతర మెటీరియల్, రాళ్లను ప్రత్యేక పైపుల ద్వారా బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహాయక సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు రోబోలను పంపుతామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. అలాగే కేరళ నుంచి ప్రత్యేకంగా రప్పించిన క్యాడవర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్‌లోకి పంపించనున్నారు. మానవ అవశేషాలను పసిగట్టే సామర్థ్యమున్న ఈ జాగిలాలు సంఘటన జరిగిన ప్రదేశాల్లో వాసనను గుర్తిస్తాయి. జాగిలాలు పసిగట్టిన ప్రదేశాల్లో తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహం లభించిన ప్రదేశంలో తవ్వకాలు చేస్తుండగా దుర్వాసన వెలువడుతున్నట్టు గుర్తించారు. అక్కడ మరొకరి అవశేషాలు ఉండే అవకాశం ఉన్నందున శిథిలాలను తొలగిస్తున్నారు. విపత్తు నిర్వహణ శాఖ ప్రధాన ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ మంగళవారం సహాయ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి మరో రెండు మృతదేహాల వెలికితీతకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. TBM (టన్నెల్ బోరింగ్ మిషన్) మట్టి తొలగింపు, డీ వాటరింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.