Site icon NTV Telugu

Siva Karthikeyan: అడగకుండానే 50 లక్షల సాయం.. ఊరికే అయిపోతారా స్టార్లు?

Sivakarthikeyan Parasakthi

Sivakarthikeyan Parasakthi

నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, ఆపదలో ఉన్న తోటి కళాకారుడికి అడగకుండానే సాయం చేసి, ఆ కృతజ్ఞతను కూడా ఆశించని నైజం శివకార్తికేయన్‌ది అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే తమిళ నటుడు ప్రేమ్ కుమార్ కుమారుడు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అడ్మిషన్ సంపాదించారు. అయితే, విదేశీ విద్యకు అయ్యే భారీ ఖర్చు కోసం బ్యాంకును ఆశ్రయించారు. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావాలంటే బ్యాంకు వారు ‘ష్యూరిటీ’ అడిగారు కానీ దురదృష్టవశాత్తూ, అప్పటికే తన ఇల్లు ఈఎంఐ (EMI) లో ఉండటంతో, మరే ఇతర ఆస్తిని హామీగా చూపలేక తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. తన కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఆందోళనలో ఆయన ఉన్నారట.

Also Read:Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..

అయితే శివకార్తికేయన్‌ను కలిసినప్పుడు, ప్రేమ్ కుమార్ తన పరిస్థితిని వివరించారు. సహాయం చేయమని ఆయన అడగలేదు కానీ, శివకార్తికేయన్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు. ప్రేమ్ కుమార్‌కు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, శివకార్తికేయన్ ₹50 లక్షల రూపాయలను బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిని ప్రేమ్ కుమార్ కుమారుడి చదువు కోసం ష్యూరిటీగా సమర్పించారు. ఒక స్టార్ హీరోకు ₹50 లక్షలు అనేది చిన్న మొత్తం కాకపోవచ్చు, కానీ ఎటువంటి గ్యారెంటీ లేకుండా, కేవలం మానవత్వంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం శివకార్తికేయన్ గొప్పతనానికి నిదర్శనం అని అంటున్నారు. అంతేకాక ఈ సాయం గురించి శివకార్తికేయన్ ఎక్కడా గొప్పలు చెప్పుకోలేదు. ప్రేమ్ కుమార్ అప్పు తీర్చే వరకు కనీసం ఒక్క మాట కూడా ఆ డబ్బు గురించి అడగలేదట. “ఈ రోజు నా కొడుకు నెలకు ₹5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే.. దానికి కారణం శివ పెట్టిన భిక్ష. ఆ రోజు ఆయన ఆదుకోకపోతే నా కొడుకు భవిష్యత్తు అంధకారమయ్యేది.” అని ప్రేమ్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రూపాయి సాయం చేస్తే వంద మందికి తెలిసేలా ప్రచారం చేసుకునే లోకంలో మనం ఉన్నాం కానీ, ఎడమ చేత్తో చేసే సాయం కుడి చేతికి తెలియకూడదు అన్న సామెతను శివకార్తికేయన్ నిజం చేశారు.

Exit mobile version