Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్‌ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..

  • శ్రద్ధా హత్య కేసులో ఆఫ్తాబ్‌ ఫోరెన్సిక్ పరీక్షలు వెలుగులోకి..
  • సైకో, సోషియోపాథిక్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.
  • నేరంపై పశ్చాత్తాపం కంటే తనను కాపాడుకోవడంపైనే దృష్టి.
Shraddha Walkar

Shraddha Walkar

Shraddha Walkar case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ కేసును ప్రజలు అంత తేలిగ్గా మరిచిపోలేరు. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న శ్రద్ధాను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలుగా కోసి, ఢిల్లీ శివారు ప్రాంతాల్లో పారేశాడు. అయితే, అతడిని నిర్వహించిన ఫోరెన్సిక్ ఫలితాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2022లో అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్, వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్షలు నిర్వహించారు. దీంట్లో అఫ్తాబ్‌లో సైకో (Psychopathic), సోషియోపాథిక్ (Sociopathic) లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

పరీక్షల సమయంలో అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం, భావోద్వేగం లేకపోవడం, ఇతరుల పట్ల సానుభూతి లేకపోవడం, పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే స్వభావం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అఫ్తాప్‌పై అగ్రెసివ్ టెండెన్సీ స్కేల్, ఐసెంక్ పర్సనాలటీ టెస్ట్, పిక్చర్ ప్రస్ట్రేషన్ టెస్ట్, ఎమోషనల్ మెచ్యురిటీ టెస్ట్ నిర్వహించారు. వీటి ద్వారా ఆగ్రహ స్వభావం, భావోద్వేగ నియంత్రణ, ఒత్తిడిని ఎదుర్కొనే తీరు, వ్యక్తిత్వ లక్షణాలను విశ్లేషించారు. ఈ పరీక్షల్లో అఫ్తాబ్‌లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని, చట్టం నుంచి ఎలా బయటపడాలనేదే అతడి ప్రధాన ఆలోచనగా కనిపించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే 2022లో సంచలనం సృష్టించిన ఈ కేసులతో విచారణ జాప్యంపై శ్రద్ధావాకర్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె తరుఫు న్యాయవాది సీమా సమృద్ధి కుష్వాహా విచారణ ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఉద్దేశపూర్వక ఆలస్యం జరుగుతోందని, త్వరితగతిన విచారణ జరిపించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. విచారణ పూర్తికాకపోవడంతో శ్రద్ధా మృతదేహ అవశేషాలు ఇంకా కేసు ఆధారాలుగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆమెకు పూర్తి స్థాయిలో అంత్యక్రియలు నిర్వహించలేకపోతున్నారని న్యాయవాది తెలిపారు. ఇప్పటికే శ్రద్ధా తల్లి 2020లో మరణించగా, తండ్రి 2025లో గుండెపోటుతో కన్నుమూశారు. ఈ హత్య కేసు కారణంగా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని ఆమె పేర్కొన్నారు.