Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో

Indonesia

Indonesia

Indonesia: ఓ ఘటన ఇండోనేషియాలో జరిగినట్లుగా సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. తరచూ జరుగుతున్న దొంగతనాలతో విసిగిపోయిన స్థానికులు.. దొంగతనం చేస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులకు వినూత్నంగా శిక్ష విధించారు. దొంగలను కొట్టడం లేదా హింసించడం కాకుండా, తల నుంచి కాళ్ల వరకు బ్రౌన్ కలర్ డక్ట్ టేప్‌తో పూర్తిగా చుట్టేయడంతో వారు ఈజిప్టు ‘మమ్మీ’లను తలపించేలా మారిపోయారు.

వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. ఈ ఘటన ఇండోనేషియాలోని ఓ నివాస ప్రాంతంలో చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ దుకాణంలో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతంలో ఇటీవల తరచూ దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులు ముందుగానే అప్రమత్తంగా ఉండడంతో వారిని పట్టుకున్నారు. దొంగతనానికి ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

పోలీసులు వచ్చే వరకు వారు తప్పించుకోకుండా ఉండేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు అక్కడి స్థానికులు. నలుగురినీ టేప్‌తో పూర్తిగా చుట్టేసి అక్కడే ఉంచినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్థానికుల చర్యను సమర్థిస్తూ దొంగతనాలను అరికట్టేందుకు ఇది హెచ్చరికగా పనిచేస్తుందని వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయంపై అధికారికంగా స్పష్టత లేదు.