Shehbaz Sharif: పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్.. భారత్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ‘యాద్గార్-ఎ-ఫతే’ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్‌ను హెచ్చరించారు. పాకిస్తాన్‌కు చెందిన ప్రతి నీటి చుక్క తమకు ‘రెడ్ లైన్’ అని స్పష్టం చేశారు. భారత్ తన వైఖరిని మార్చుకోకపోతే పాకిస్తాన్ తగిన విధంగా స్పందిస్తుందని షాబాజ్ షరీఫ్ హెచ్చరించారు. 2025 మేలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో పాకిస్తాన్ సార్వభౌమత్వం, భద్రతకు సవాలు ఎదురైతే గతంలో కంటే మరింత తీవ్రమైన బలంతో ప్రతిస్పందిస్తామని అన్నారు.
2025 ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. అనంతరం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. ఈ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాకిస్తాన్ శాంతి, గౌరవం, హుందాతనానికి కట్టుబడి ఉంటుందని షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే, తమ సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భద్రతకు ముప్పు ఏర్పడితే మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ఘనత ట్రంప్‌కు దక్కింది.
తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కూడా షాబాజ్ షరీఫ్ ప్రస్తావించారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. అయితే కాల్పుల విరమణ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించిందన్న వాదనను భారత్ అంగీకరించలేదు. ఇదే సమయంలో చైనాతో పాకిస్తాన్ సంబంధాలపైనా షాబాజ్ షరీఫ్ మాట్లాడారు. ప్రతి కష్టకాలంలోనూ చైనా పాకిస్తాన్‌కు అండగా నిలిచిందని అన్నారు. పాకిస్తాన్-చైనా స్నేహం హిమాలయాల కంటే ఉన్నతమైనదని వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియాతో కుదిరిన రక్షణ ఒప్పందం, అందులో టర్కీ భాగస్వామ్యాన్ని కూడా ప్రస్తావిస్తూ.. ఇది ప్రాంతీయ శాంతికి సందేశమని పేర్కొన్నారు.
మొత్తంగా షాబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు శాంతి, సంయమనం గురించి ప్రస్తావిస్తూనే భారత్‌కు గట్టి హెచ్చరికలు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా సింధు జలాల అంశంతో పాటు 2025 మే నాటి ఘర్షణను ప్రస్తావించడం ద్వారా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ రాజకీయ స్థాయిలో పరస్పర విమర్శలు, హెచ్చరికలు కొనసాగుతున్నాయనే సంకేతాలు ఇచ్చారు.

