తెలంగాణ కుంభమేళా.. వనదేవతల మహాజాతర మేడారంకు భక్తులు భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు తల్లిపిల్లలతో కలిసి వెళ్తున్నారు. అయితే.. మేడారం అనగానే గుర్తొచ్చేంది.. తినడం, తాగడం.. అందుకోసమని ఎన్ని డబ్బులు లెక్కచేయకుండా అక్కడికి వెళ్లి కనీసం మూడు, నాలుగురోజుల పాటు ఎంజాయ్ చేస్తారు. దేవతలను దర్శించుకున్నాక.. పచ్చని అడవిలో కుటుంబమంతా కలిసి కోళ్లు, మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇలా తమకు ఉన్నంతలో కోళ్లు గానీ, మేకలు గానీ కోస్తారు.
ఇదిలా ఉంటే.. మేడారం జాతరకు బయల్దేరిన ఓ వ్యక్తి మూడు పొట్టేళ్లను ఆర్టీసీ బస్సు ఎక్కించాడు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేడారం జాతరకు భారీగా భక్తులు తరలివెళ్తుండగా.. బస్సుల్లో పట్టుచాలని పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో కూడా పొట్టేళ్లను బస్సు ఎక్కించాడంటే అతను మాములోడు కాదు.
Read Also: AP DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్‌పై విచారణ.. ఏజీ అభ్యర్థనతో వాయిదా వేసిన హైకోర్టు
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. మేడారం జాతరకు తీసుకెళ్లేందుకు గొర్రె పోతులను బస్సులో ఎక్కించాడు. బస్సులో అయితే తక్కువ ఖర్చులో అయిపోతుందని ఊహించిన వ్యక్తి.. బస్సులో తీసుకెళ్తున్నాడు. అయితే కండక్టర్ కూడా వద్దని చెప్పకుండా.. వాటికి టికెట్ కొట్టాడు. పోతే పోనిలే అన్నట్లుగా గొర్రెలను తీసుకెళ్తున్న ప్రయాణికుడు కూడా వాటికి టికెట్ తీసుకున్నాడు. మరోవైపు.. వాటిని బస్సులో ఎక్కించడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బస్సులో ఉన్న ఓ వ్యక్తి.. ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
మరోవైపు.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలను అనుమతించమని స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ వేలాది బస్సులను మేడారంకు నడుపుతోంది. అయితే వీటిలో మూగజీవాలకు ఎంట్రీ లేదని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకు రాకుండా భక్తులు సహకరించాలని కోరారు. అయినప్పటికీ జనాలు వినకుండా మూగజీవాలను బస్సుల్లో తీసుకెళ్తున్నారు.