Actor Shatrughan Sinha Hospitalised: బాలీవుడ్ సీనియర్ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్ సిన్హా ఆదివారం తెలిపారు. నాన్నకు తీవ్ర జ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లామని, సాధారణంగా చేయించే వైద్యపరీక్షలు చేయిస్తున్నాం అని లవ్ సిన్హా చెప్పారు. శత్రుఘ్న సిన్హా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నూతన వధూవరులు సోనాక్షి సిన్హా, జహీర్ అబ్బాస్ వచ్చి వెళ్లారు.
వారం రోజుల కిందటే శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా వివాహం నటుడు జహీర్ ఇక్బాల్‌తో జరిగింది. ఈ కార్యక్రమాలతో జూన్ నెలంతా శత్రుఘ్న బిజీగా గడిపారు. పని ఒత్తిడి కారణంగా ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని సమాచారం. శత్రుఘ్న ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆయన ఈరోజు డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. జూన్ 25న శత్రుఘ్న సోఫాలోంచి లేస్తుండగా కిందపడిపోయాడని కూడా సమాచారం. ఆ సమయంలో ఆయన పాదంకు చిన్న గాయం అయిందట. ఓ రోజు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నా.. పక్కటెముకల నొప్పి తగ్గకపోవడంతో మరుసటి రోజు కోకిలాబెన్ ఆసుపత్రికి తీసుకెళ్లారట.
Also Read: Vijay Deverakonda: నా వల్లే నాగ్ అశ్విన్ సినిమాలు ఆడటం లేదు: విజయ్
జూన్ 4న వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమబెంగాల్‌లోని ఆసన్‌సోల్ నియోజకవర్గం నుంచి శత్రుఘ్న సిన్హా విజయం సాధించారు. ఇక 1969లో శత్రుఘ్న సినీరంగ ప్రవేశం చేశారు. మేరే అప్నే, కాళీచరణ్, విశ్వనాథ్, కాలాపత్థర్, దోస్తానా వంటి చిత్రాలతో స్టార్ అయ్యారు. శత్రుఘ్న నట వారసురాలిగా సోనాక్షి సిన్హా ఉన్నారు.