Site icon NTV Telugu

Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 30న శశి థరూర్ నామినేషన్

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 30న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ‌ అధ్యక్ష ప‌ద‌వికి పోటీ ప‌డాలంటే ఆ అభ్యర్థి పేరును దేశంలోని 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్రతిపాదించాలి. ఈ నేప‌థ్యంలో శ‌శిథ‌రూర్ ఐదు సెట్ల నామినేష‌న్ పేప‌ర్స్ సిద్ధం చేసుకుని వివిధ రాష్ట్రాల్లోని పార్టీ ప్రతినిధుల‌ను సంప్రదిస్తున్నారు. ఇదిలావుండగా, గాంధీ కుటుంబానికి చెందని నేత కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న సందర్భం 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాబోతోంది. సీతారాం కేసరి నుంచి 1998లో ఆ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ స్వీకరించారు. సీతారాం కేసరి 1997లో శరద్ పవార్, రాజేశ్ పైలట్‌లను ఓడించి, ఆ పదవిని చేపట్టారు.

Sonia Gandhi: సోనియాగాంధీతో లాలూ, నితీష్‌ భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప‌దవికి రాజీనామా చేశారు. దాంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యత‌లు స్వీకరించారు. మ‌రోసారి అధ్యక్ష బాధ్యత‌లు చేప‌ట్టాల‌ని పార్టీ కోరినా రాహుల్‌గాంధీ నిరాక‌రించారు. రాహుల్ ప్రకటనతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌, ఎంపీ శశిథరూర్‌ పార్టీ అధ్యక్ష బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. మరికొంది నేతల పేర్లు వినిపించినా చివరిగా ఈ ఇద్దరి పేర్లు మాత్రమే ఖరారయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం పైన పేర్కొన్న ఎన్నికలు అన్ని పీసీసీలలో అక్టోబర్ 17న నిర్వహించబడతాయి, దీని ఫలితాలు ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే అక్టోబర్ 19న ప్రకటించబడతాయి. అభ్యర్థుల తుది జాబితాను అక్టోబర్ 8 సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తారు.

Exit mobile version