Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. అనూహ్య మలుపులు తిరిగిన కాంగ్రెస్ రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ ఎంపీ శశి థరూర్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి శుక్రవారం ఆ పార్టీ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన నామినేషన్ దాఖలు చేయడానికి ముందు శశిథరూర్ మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక మూలస్తంభంగా గాంధీ కుటుంబం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. ఆ కుటుంబమే తమ పార్టీకి నైతిక బలమని, అంతిమ మార్గదర్శక స్ఫూర్తి అని తెలిపారు. మంచి నేతలు పార్టీని వదిలిపెట్టకుండా నిలువరించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ డీఎన్ఏకు, గాంధీ కుటుంబం డీఎన్ఏకు అనుబంధం ఉందన్నారు. దేశాన్ని ఏక వ్యక్తి పరిపాలించకూడదన్నారు. తనకు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేవన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటునట్లు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన నామినేషన్ పత్రాలపై దిగ్విజయ్ సంతకం చేశారు. దీంతో ఖర్గే, శశిథరూర్ మధ్యే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ జరగనుంది. మరోవైపు, మల్లికార్జున ఖర్గే అభ్యర్థిత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా నామినేషన్ దాఖలు చేశారు. కేసీ వేణుగోపాల్ సూచనల మేరకు ఖర్గే పోటీలోకి దిగినట్లు తెలుస్తోంది.
CDS Anil Chauhan: సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ చౌహాన్
జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి కూడా పార్టీ అత్యున్నత స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకుల నిర్ణయాన్ని గౌరవిస్తామని ఆయన అన్నారు. తాను రైతు కుటుంబానికి చెందినవాడినని ఆయన వెల్లడించారు. భారత వైమానిక దళంలో పనిచేసిన అనుభవం ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా, జార్ఖండ్ శాసనసభ ఉపనేతగా ఎన్నికైన ఓ రైతు కొడుకు కూడా ఏఐసీసీ పదవికి పోటీ చేయడాన్ని దేశం చూస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
