Apsara Death Case: శంషాబాద్ పరిధిలో జరిగిన అప్సర అనే యువతి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు గురించి శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. అప్సర తనను పెళ్లి చేసుకోవాలని నిందితుడు సాయికృష్ణను వేధించడంతో హత్య చేసినట్లు ఆయన తెలిపారు.
డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు అయ్యగారి వెంకట సాయి కృష్ణది అంబేడ్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్ర పురం గ్రామం కాగా.. అతను మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశాడు. 2010 లో పెళ్లి అయ్యింది. ప్రస్తుతం పూజారిగా ఉన్నాడు. అతనికి ఒక పాప ఉంది. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అప్సరది తమిళనాడు.. డిగ్రీ పూర్తి చేసింది. సినీ రంగంలో పనిచేసింది. 2022 ఏప్రిల్‌లో హైదరాబాద్ వచ్చింది. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నాడు. సరూర్ నగర్ బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చే అప్సరతో.. అదే ఆలయంలో పూజారిగా ఉన్న సాయికృష్ణ పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ.. శారీరక సంబంధంగా మారింది. 2023 మార్చిలో తనను పెళ్లి చేసుకోవాలి అని అప్సర సాయి కృష్ణని కోరింది. సాయి కృష్ణకి పెళ్లి అయింది అని తెలిసినప్పటికీ.. బలవంతం చేసింది. అప్సర ప్రవర్తనతో విసిగెత్తిన సాయికృష్ణ అప్సరను చంపాలి అని నిశ్చయించుకున్నాడు.
ఈ నెల 3వ తేదీన దారుణంగా హత్య చేశాడు. 4వ తేదీన మృతదేహాన్ని మ్యాన్‌హోల్ పడేశాడు. 5వ తేదీన మ్యాన్‌హోల్‌లో మట్టీ వేశాడు. రాత్రి వరకు వాసన ఎక్కువ రావడంతో మళ్లీ కొంత మట్టి పోశాడు. ఇదిలా ఉండగా.. కూతురు కనిపించట్లేదంటూ అప్సర తల్లి పోలీసులను ఆశ్రయించింది. అప్సర కోసం పోలీసులతోపాటు నిందితుడు సాయి కూడా అన్నిచోట్ల వెతికాడు. పోలీసులు సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్ ట్రాక్ రికార్డును పరిశీలించారు. సాయి, అప్సర సెల్ ఫోన్లు మరుసటి రోజు ఒకే దగ్గర ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గురువారం రోజున సాయిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం బయటపడింది. పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్న నేపథ్యంలో హత్య చేశానని సాయి ఒప్పుకున్నాడు. దీంతో పాటు గత కొన్నాళ్ల నుంచి అప్సరతో వివాహేతర సంబంధం ఉందని ఒప్పుకున్నట్లు తెలిసింది. వివాహం చేసుకోవాలని అప్సర చిత్ర హింసలకు గురి చేసిందని సాయి చెప్పాడు. వివాహేతర సంబంధం బయటపడుతుందని భయంతోనే హత్య చేశానని సాయి తెలపడంతో అసలు నిజం బయటపడిందని డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.
సీన్ బై సీన్
ఈనెల 3న కోయంబత్తూర్ సందర్శించే నెపంతో.. తన కారులో అప్సరని ఎక్కించుకున్నాడు. 8.15 కి సరూర్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యారు. 11 గంటలకు శంషాబాద్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే కారు ముందు సీట్‌లో అప్సర పడుకుని ఉంది. 3.50 ప్రాంతంలో సుల్తాన్ పూర్ వద్ద ఉన్న గోశాల వైపు తీసుకెళ్లాడు. పడుకున్న అప్సర మొహంపై కారు కవరింగ్ షీట్ సహాయంతో బలంగా నొక్కాడు. అప్సర ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహంతో తన వెంట ముందుగానే తెచ్చుకున్న బెల్లం దంచే రాయితో కొట్టాడు. దాదాపు 10 సార్లు కొట్టడంతో అప్సర అక్కడికక్కడే చనిపోయింది. అప్సరను అదే కారులో తీసుకొని ఇంటికి వచ్చిన సాయి.. డెడ్ బాడీని కారులోనే పెట్టి ఒక రోజు మొత్తం ఇంటిముందే పార్క్ చేశాడు. మరుసటి రోజున డెడ్ బాడీ తీసుకువెళ్లి మ్యాన్‌హోల్ లోంచి కిందికి పడేశాడు. మ్యాన్‌హోల్‌లో డెడ్ బాడీ వేసిన తర్వాత మట్టిని అందులో మట్టిని నింపాడు. మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తుందని మట్టి నింపుతున్నట్లు డ్రామా ఆడాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉదయం సమయంలో మ్యాన్‌హోల్‌లో మట్టిని నింపాడు. పోలీసుల విచారణలో ఎట్టకేలకు పట్టుబడ్డాడు.