Nagpur Serial Bride: అందం, తెలివి తేటలు రెండూ ఉన్నాయి. పైగా టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. కానీ తన అందాన్ని తెలివి తేటలను అమాయకులను మోసం చేయడానికి ఉపయోగించింది. పెళ్లిళ్ల పేరుతో చీటింగ్ చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు 8 పెళ్లిళ్లు చేసుకుని.. చివరికి తొమ్మిదో పెళ్లికి రెడీ అయింది. కానీ దురదృష్టం వెంటాడడంతో పోలీసులకు చిక్కింది. ఇంతకీ ఆ మాయలేడీ ఎవరు ? ఆ కిలాడీ కథేంటి?
నిత్య పెళ్లికొడుకు.. వ్యవహారాలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తూ, బ్లాక్‌మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసిన స్టోరీలను ఎన్నో చూసుంటాం. కానీ ఎప్పుడు అబ్బాయి లేనా మేము మాత్రం తక్కువ కాదు అంటూ ఈ దందాకు తెరలేపింది ఓ కిలేడీ. ఇప్పటివరకు 8 పెళ్లిళ్లు చేసుకొని.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులకు పట్టుబడింది.
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న కిలాడీ లేడీ పేరు సమీరా ఫాతిమా. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ స్వస్థలం. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. కానీ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన సమీరా గాడి తప్పింది. 15 ఏళ్లుగా నిత్య పెళ్లికూతురుగా పలువురిని మోసం చేసింది పాతిమా. పెళ్లి చేసుకోవడం.. కాపురం చేస్తున్నట్లు నటించడం ఆ తర్వాత భర్తను బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడం సమీరా ఫాతిమా నైజం.
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మోసం చేస్తోంది ఫాతిమా. ఓ ఎమోషనల్ డ్రామాతో అమాయకులను బుట్టలో వేసుకుంటుంది. పెళ్లి తర్వాత భర్తను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తుంది. అవసరమైతే బలవంతంగా డబ్బు వసూలు చేసేలా ఓ టీమ్‌ని కూడా సెట్ చేసింది. అలా ఈమె బారిన పడ్డ ఓ బాధితుడు.. తన నుంచి 50 లక్షలు బలవంతంగా వసూలు చేసిందని ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. సమీరా ఫాతిమా లిస్టులో ఉన్నత చదువులు చదివినవారు, రిజర్వ్ బ్యాంక్ సీనియర్ అధికారి సైతం ఉండడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.
భర్తను సెలెక్ట్ చేయడంలో సమీరా ఫాతిమా స్టైలే వేరు. ముందుగా డబ్బున్న, పెళ్లికాని పురుషుల వివరాలను.. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా సేకరించి స్నేహం పెంచుకుంటుంది. ఆ తర్వాత తాను విడాకుల తీసుకున్నానని.. ఒక చిన్నపిల్లను చూసుకుంటున్నానని ఎమోషనల్ స్టోరీ చెబుతుంది. వివాహం అయిన అనంతరం కొంతకాలం బాగున్నట్టు నటిస్తుంది. చివరగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కాజేస్తుంది. జూలై 29న నాగ్‌పూర్‌లోని ఓ టీ దుకాణం వద్ద 9వ భర్తను కలవడానికి వచ్చిన సందర్భంలో.. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆమెకు సహకరించే ముఠాలోని ఇతర సభ్యుల వివరాల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.