Site icon NTV Telugu

Chandrababu Arrest: చంద్రబాబు లాయర్‌ మరో ఆసక్తికర ట్వీట్.. రాత్రి తర్వాత తెల్లవారుతుందంటూ..!

Sidharth Luthra

Sidharth Luthra

Chandrababu Arrest: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే ఆయన బెయిల్‌ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు.. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రంగంలోకి దిగి వాదనలు వినిపిస్తున్నారు. ఏపీ హైకోర్టు, విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఆయన తరఫు వాదించిన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్‌ (X).. ఆసక్తికరంగా మారింది. “ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది” అని సిద్ధార్థ లూథ్రా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ఆయన.. ”అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది” అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘ఈరోజు ఇదే మా నినాదం’ అని ఆనాడు ఆయన పేర్కొన్నారు. దీంతో మీరే గెలుస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.. మరికొందరు నెగిటివ్‌ కామెంట్లు కూడా రాసుకొచ్చారు.

Also Read: Chandrababu Arrest: చంద్రబాబును ప్రశ్నించేందుకు రేపు రాజమండ్రికి సీఐడీ బృందం

ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం చంద్రబాబును 2 రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ చెప్పింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులను అనుమతిస్తామని జడ్జి పేర్కొన్నారు. విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లను ఇవ్వాలని న్యాయమూర్తి ఏపీ సీఐడీని ఆదేశించారు. చంద్రబాబు విచారణ వీడియోలు బయటకు రాకుండా చూడాలని న్యాయమూర్తి కోరారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.

 

Exit mobile version