G. S. Varadachary: వయోధిక పాత్రికేయ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గోవర్ధన సుందర వరదాచారి (92) అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో 1932 అక్టోబర్ 15న జన్మించిన వరదాచారి పాత్రికేయ రంగంలో తనదైన ముద్రను వేశారు. అనారోగ్య కారణంగా కిమ్స్ లో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణాపత్రిక పఠనంతో పాత్రికేయ రంగంపై మక్కువ పెంచుకున్న వరదాచారి 1948లో ఆంధ్ర జనత పత్రికతో జర్నలిజం వృత్తిలోకి అడుగుపెట్టారు. విశేషం ఏమంటే… జర్నలిజం డిగ్రీతో ఈ రంగంలోకి అడుగుపెట్టిన అతి కొద్దిమంది ప్రముఖులలో ఆయన ఒకరు. ఈనాడు, ఆంధ్రభూమి దిన పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన వరదాచారి తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉపాధ్యక్షునిగానూ సేవలు అందించారు.
తెలుగు విశ్వ విద్యాలయంలో జర్నలిజం విద్యార్థులకు విజిటింగ్ ప్రొఫెసర్ గా పాఠాలు బోధించారు. పాత్రికేయ రంగానికి ఆయన చేసిన సేవకు గానూ తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. పలు ప్రభుత్వాలు ఆయనను వివిధ సందర్భాలలో ఘనంగా సత్కరించాయి. జర్నలిస్ట్ గా పనిచేస్తూనే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శ పదవులనూ నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ అనంతరం వయోధిక పాత్రికేయ సంఘం స్థాపించి, సీనియర్ జర్నలిస్టులకు ఓ గుర్తింపును, గౌరవాన్ని అందించే ప్రయత్నం చేశారు. జర్నలిజంపై పలు పుస్తకాలను వెలువరించారు. వరదాచారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన మృతి తెలుగు పాత్రికేయ రంగానికి తీరని లోటు అని వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు, కార్యదర్శి కె. లక్ష్మణ రావు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు.