NTV Telugu Site icon

Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్ నియామకం

Dgp

Dgp

Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. పంజాబ్‌కు చెందిన జితేందర్‌ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్‌.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి డీజీపీ అయ్యారు. తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Read Also: IAS: ట్రైనీ ఐఏఎస్ ఓవరాక్షన్.. మూల్యం చెల్లించుకున్న అసిస్టెంట్ కలెక్టర్‌

పంజాబ్‌లోని జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీలో సీబీఐలో కొంత కాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 2025 సెప్టెంబరులో పదవీ విరమణ చేస్తారు. తాజా నియామకంతో 14 నెలలపాటు డీజీపీగా జితేందర్‌ కొనసాగనున్నారు.