Seediri Appalaraju: కూటమి అభద్రతా భావానికి తప్పుడు కేసులే నిదర్శనం: సీదిరి అప్పలరాజు

Seediri Appala Raju

Seediri Appala Raju

శ్రీకాకుళం జిల్లా సబ్ జైలులో 23 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుకు నేడు బెయిల్ మంజూరైంది. బెయిల్‌పై జైలు నుండి విడుదలైన ఆయనకు కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు ఘనస్వాగతం పలికి ఆనందం వ్యక్తం చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో ప్రజాపోరాటాలు చేయడం సహజమని, కానీ తమపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి పిల్లలను, కుటుంబాలను లాగడం అత్యంత దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యంగా జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని కూటమి నాయకులు కుట్రపూరితంగా హత్యాయత్నం కేసుగా చిత్రీకరించి, అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీవ్ర అభద్రతా భావంతో ఉంటూ, తనపై కక్ష తీర్చుకోవడానికి తన కుమారుడి భవిష్యత్తును బలిచేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (SHO)తో మాట్లాడి, తన అనుభవాన్ని తప్పుడు కేసులకు ఉపయోగించారని ఆరోపించారు. ఈ అన్యాయంపై మత్స్యకార సామాజికవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు లభించిన ప్రజా మద్దతు, ప్రజలలో వ్యక్తమవుతున్న తిరుగుబాటుకు సజీవ నిదర్శనమని చెప్పారు. ప్రారంభంలో తనకు కొంత నిరాశ భావం ఉన్నప్పటికీ, జైలు ములాఖాత్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కలిసి ధైర్యం చెప్పారని పేర్కొన్నారు.

ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి పర్యటన నిర్ణయం, లక్షలాది మంది ప్రజలు స్పందించిన తీరు ఎంతో గర్వాన్ని, కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, పేరాడ తిలక్, ఆమదాలవలస ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌లపై కూడా తప్పుడు కేసులు బనాయించి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువ మాట్లాడనని, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు.