Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో భద్రత ప్రశ్నార్థకం..! టీటీడీపై విమర్శలు

Ttd

Ttd

Tirumala: నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయంలో.. భద్రతలోని డొల్లతనం మరోసారి బయటపడింది. శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్లతో ప్రవేశం పూర్తిగా నిషిద్ధం. భక్తులు సెల్‌ఫోన్లు, కెమెరాలు వంటి వాటితో శ్రీవారి సన్నిధిలోకి వెళ్లకుండా.. టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే, మూడంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని మరీ.. శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించడం, ఆ దృశ్యాలు వెలుగుచూడటం వంటి వరుస పరిణామాలు తీవ్ర కలకలం రేపాయి. తాజాగా జరిగిన ఘటనతో తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి వెలుగుచూసింది.

తిరుమలలో కొద్ది రోజుల క్రితమే శ్రీవారి ఆనంద నిలయాన్ని డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు సంచలనం రేపాయి. ఇక ఇటీవల తిరుమలలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారంటూ టీటీడీకి మెయిల్‌ ద్వారా సమాచారం రావడం.. భద్రతాధికారులు, సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించడం.. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వెలుగుచూడటం సంచలనంగా మారింది. ఆలయంలో నలువైపుల నుంచి శ్రీవారి ఆనంద నిలయాన్ని చిత్రీకరించిన దృశ్యాలు.. తిరుమలలో భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందనే దానికి నిదర్శనంగా నిలిచాయి.

మూడు అంచెల భద్రతా వ్యవస్థను దాటుకుని ఆలయంలోకి కెమెరాతో ఎలా ప్రవేశించారు? ఆనంద నిలయ దృశ్యాలను చిత్రికరించే సమయంలో భద్రతా సిబ్బంది ఎందుకు గుర్తించలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం కొరవడింది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు సీరియస్‌గా స్పందించారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ ద్వారా ఆలయ దృశ్యాలను మహిళా భక్తురాలు చిత్రీకరించినట్లుగా భద్రతాధికారులు గుర్తించారు. మొబైల్‌ ఫోన్‌తో కాకుండా.. సీక్రెట్‌ కెమెరాతో వీడియో తీసినట్లుగా కూడా గుర్తించారు. ముందుగా సదరు మహిళను గుర్తించే పనిలో పడ్డారు. ఆమె ఎవరని తేలితే.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశముంది.

అయితే, శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తుంటారు భద్రతా సిబ్బంది. సెల్‌ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ.. ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి కెమెరా తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై.. భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయంలో భద్రత ఇదేనా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, టీటీడీ అధికారులు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని టీటీడీ విజిలెన్స్‌ అధికారి బాలిరెడ్డి చెప్పారు.

Exit mobile version