Site icon NTV Telugu

Jagananna Aarogya Suraksha: రేపటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్షా రెండో ఫేజ్.. వైద్యారోగ్య శాఖ సర్వం సన్నద్ధం

Cm Ys Jagan

Cm Ys Jagan

Jagananna Aarogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో దశలో మొదటి గ్రామీణ ప్రాంతాల్లో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్‌ క్యాంపులు ప్రారంభం కానున్నాయి. 6 నెలల పాటు ఈ రెండో దశ కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందురు ఏపీ వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి వద్దే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నది జగన్‌ సర్కార్ లక్ష్యం. అవసరమైన సందర్భాలలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోలు, ఎఎన్ఎంలకు అప్పగించారు. వారు చికిత్సానంతరం పేషెంట్లకు అవసరమైన కన్సల్టేషన్ సేవలతో పాటు అవసరమైన మందుల్ని కూడా వారికి అందజేస్తారు.

Read Also: Bhavani Deeksha: ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న భవానీ దీక్షా విరమణలు

మొదటి దశలో 12,423 ఆరోగ్య శిబిరాలను నిర్వహించి 1,64,982 మంది రోగులకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ద్వారా ఉచిత వైద్య సేవలను అందించింది సర్కారు. తొలిదశ కార్యక్రమంలో సీహెచ్వోలు, ఎఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలలో 1,45,35,705 ఇళ్ళను సందర్శించి 6.45 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తొలిదశ కార్యక్రమంలో నిర్వహించిన 12,423 ఆరోగ్య శిబిరాలలో 60,27,843 మంది ప్రజలు ఓపీ సేవలు అందుకోగా, 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు తరలించి ఉచిత వైద్య చికిత్సను అందించారు. ఈ నేపథ్యంలో రెండో దశను మరింత విస్తృతస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమైంది. వైద్యం అందించడంలో ఏ ఒక్క గ్రామాన్ని వదిలిపెట్టరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం రెండో దశను నిర్వహించడానికి 6 నెలల వ్యవధిని నిర్దేశించింది.

 

Exit mobile version