Crime News: విద్యాబుద్ధులు చెప్పి వాళ్లను తీర్చిదిద్దాల్సిన టీచర్లే విద్యార్థుల భవిష్యత్‌ను చిదిమేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. ప్రతీరోజు ఏదో ఒక చోట తమ దగ్గర విద్యనభ్యసిస్తున్న స్టూడెంట్లపై దాడులకు పాల్పడుతున్న కీచక టీచర్ల వార్తలు వింటూనే ఉన్నాం. అదే క్రమంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. స్కూల్ విహార యాత్రలో విద్యార్థినికి మత్తుమందు ఇచ్చిన ప్రిన్సిపాల్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక ప్రభుత్వ స్కూల్‌కు చెందిన ప్రిన్సిపాల్ నవంబర్ 23న 11వ తరగతి చదువుతున్న తొమ్మిదిమంది విద్యార్థులను టూర్ నిమిత్తం బృందావనం తీసుకెళ్లాడు.
Read Also: MLC Kavitha: ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ
ఆ రాత్రి అక్కడ బస చేసేందుకు హోటల్‌లో రెండు గదులు బుక్ చేశాడు. ఒక రూమ్‌లో ఎనిమిది విద్యార్థులు ఉండగా, 17 ఏళ్ల బాలికతో కలిసి మరో గదిలో ప్రిన్సిపాల్ బస చేశాడు. ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. మత్తులో ఉన్న ఆ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరీక్షలో ఫెయిల్ చేస్తానని, చంపుతానని బెదిరించాడు. ఆ మరునాడు విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగివచ్చారు. కాగా, బాధిత బాలిక భయపడి ముందు ఈ విషయం గురించి ఎవరితో నోరువిప్పలేదు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ లైంగిక దాడి గురించి తన కుటుంబానికి తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పరారీలో ఉన్న ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.
