Scholar : డ్రగ్ మాఫియా పాలిట సింహస్వప్నం.. సంచలన కథాంశంతో ‘స్కాలర్’!!

Scholar Movie

Scholar Movie

సమాజంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే భయం.. యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్, గంజాయి మహమ్మారి. ఈ డ్రగ్స్ ఉచ్చులో పడి ఎంతోమంది యువతీయువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే బర్నింగ్ ఇష్యూను తీసుకుని, దానికి కళ్లు చెదిరే కమర్షియల్, స్పిరిచ్యువల్ యాంగిల్ జతచేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సెన్సేషనల్ మూవీ ‘స్కాలర్’. అసలు ఈ సినిమా కథాంశం వింటే ఎవరికైనా గూస్‌బంప్స్ రావాల్సిందే! ఎందుకంటే, సాధారణంగా సినిమాల్లో హీరోలు డ్రగ్ మాఫియాను తుపాకులతోనో, కత్తులతోనో అంతం చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో హీరో రూటే సపరేట్.
డ్రగ్స్‌కు బానిసలై పిట్టల్లా రాలిపోతున్న యువతను తిరిగి మామూలు మనుషులను చేయడానికి హీరో ఒక పవర్ ఫుల్ విరుగుడు (యాంటీ-డ్రగ్) కనిపెడతాడు. దీంతో అతనికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. హీరో దెబ్బకు వణికిపోయిన డ్రగ్ మాఫియా.. కక్షకట్టి అతని కుటుంబాన్ని, కన్న చెల్లిని అత్యంత దారుణంగా అంతం చేస్తుంది. మరి తన సర్వస్వాన్ని కోల్పోయిన ఆ యువకుడు.. దేశం మొత్తం నివ్వెరపోయేలా ఒక ‘స్పిరిచ్యువల్ బ్యాక్ డ్రాప్’ లో ఆ క్రూరమైన మాఫియాను ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ ‘స్కాలర్’ అసలు కథ! ఒకవైపు సైన్స్, మరోవైపు దైవత్వం కలగలిపిన ఈ పగ, ప్రతీకారాల కాన్సెప్ట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
బాలల దినోత్సవాన్ని (నవంబర్ 14) పురస్కరించుకుని గురువారం నాడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. గతంలో ఎన్నో అద్భుతమైన సందేశాత్మక చిత్రాలు తీసిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్లపై న్యూ జెర్సీకి చెందిన పొగాకు శిరీష మహేష్ సౌజన్యంతో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. కౌశిక్, ప్రతిభా సిన్హా జంటగా నటిస్తుండగా.. డైరెక్టర్ సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.