Andhra Pradesh: ఇవాళ సర్పంచుల ఛలో అసెంబ్లీ తరుణంలో నిన్నటి నుంచే సర్పంచులను హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ను నిన్ననే(సోమవారం) హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. హై అలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులు డిమాండ్ల పరిష్కారం కొరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీని ముట్టడించి తమ హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని సర్పంచ్ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కానీ కొంత మంది సర్పంచ్‌లు అసెంబ్లీ వైపు దూసుకొచ్చారు. కార్లలో అసెంబ్లీ వద్దకు సర్పంచులు చేరుకున్నారు. పోలీసుల వలయాన్ని చేధించుకుని ఊహించని విధంగా అసెంబ్లీ వద్దకు సర్పంచులు వచ్చేశారు. సర్పంచ్‌లు అసెంబ్లీ సమీపంలోకి వచ్చేయడంతో పోలీసులు కంగుతిన్నారు. బారికేడ్లను తోసుకుని లోపలకెళ్లే ప్రయత్నం చేశారు సర్పంచులు. ఈ క్రమంలోనే పోలీసులకు, సర్పంచులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అక్కడికి వచ్చిన సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Visakha Steel Plant: విశాఖ ఉక్కు అమ్మకానికి ఈవోఐ జారీ చేయలేదు.. రాజ్యసభలో కేంద్రమంత్రి
సర్పంచుల ఛలో అసెంబ్లీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులను హౌస్ అరెస్టులు చేసారు పోలీసులు. తమ 16 డిమాండ్లు నెరవేర్చాలని ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు సర్పంచుల సంఘం నేతలు. నిన్న సాయంత్రం నుంచే సర్పంచులను హౌస్ అరెస్టులు చేసినప్పటికీ, కొందరు సర్పంచులు అసెంబ్లీ పరిసరాలకు చేరుకుంటారనే సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు… బ్యారేజీ, వారధి వద్ద నుంచీ వెళ్ళే ప్రతీ వాహనాలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. సర్పంచుల ఛలో అసెంబ్లీ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద పోలీసు చెక్ పోస్టు ఏర్పాటు చేసారు… అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను పూర్తిగా పరిశీలించి పంపిస్తున్నారు పోలీసులు. ఎవరైనా సర్పంచులు అన్న అనుమానం వస్తే ముందు జాగ్రత్తగా అరెస్టు చేస్తున్నామని, అసెంబ్లీ పూర్తయ్యే వరకూ చెక్ పోస్టు వద్ద పరిశీలనలు కొనసాగుతాయని పోలీసులు చెబుతున్నారు. ఛలో అసెంబ్లీకి సర్పంచులు పిలుపు ఇవ్వటంతో బెజవాడలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఛలో అసెంబ్లీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.