Sankranti Festival: సంక్రాంతి పండుగ వరస సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లె బాటపడుతున్న ప్రజలు.. పక్క రాష్ట్రాల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఓవైపు.. విమానయాన సంస్థలు మరోవైపు.. భారీగా ధరలు పెంచేశాయి.. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి.. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజాము నుంచి వాహనాల రద్దీ క్రమ క్రమంగా పెరుగుతుంది. దీనికి తగ్గట్టుగా టోల్ ప్లాజా అధికారులు విజయవాడ వైపు ఎక్కువ టోల్ బూతులను ఓపెన్ చేశారు.. ఫాస్టాగ్ ఉండడంతో త్వర త్వరగా వెళ్తున్న వాహనాలు.. అయితే, ఫాస్టాగ్ లేని వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రేపు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవులు ఉండడంతో వాహనాలపై మరింత పెరిగే అవకాశం ఉంది.
సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకునేందుకు పట్టణవాసులు పల్లెబాట పట్టారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో 16 నెంబర్ జాతీయ రహదారిపై రద్దీ వాతావరణం నెలకొంది. 10 గుంటలకు కూడా పొగమంచు కమ్మేసి ఉండడంతో వాహనదారులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండుగ నాలుగు రోజులు గోదావరి జిల్లాలో కోడి పందాలు తోపాటు పర్యాటక ప్రాంతాల్లో విహరించేందుకు పెద్ద ఎత్తున అతిధులు తరలివస్తున్నారు. దీంతో గోదారి జిల్లాల పల్లెలన్నీ సందడిగా మారుతున్నాయి.
మరోవైపు.. రాజమండ్రి ఎయిర్ పోర్టులో సంక్రాంతి రద్దీ నెలకొంది.. దేశ విదేశాల్లో ఉన్న గోదావరి జిల్లా వాసులు క్యూ కడుతున్నారు. దీంతో రద్దీ పెరిగింది.. సంక్రాంతికి సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. మరోవైపు విమాన చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ రోజుల్లో 3000 రూపాయలు ఉండే టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 12 వేలకు పైగా ధర పలుకుతుంది. విమాన చార్జీలు భారీగా పెరిగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.. ఇక, ప్రైవేట్ బస్సులు కూడా పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి.. సాధారణం కంటే రెండు, మూడు రెట్లు బస్సు టికెట్ల ధరలను పెంచేశాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏదేమైనా పండుగకు ఊరికి వెళ్లాలన్న ఉద్దేశంతో ప్రయాణ ఛార్జీలు పెరిగినా.. పల్లె బాట పడుతున్నారు.