Chawl Land Scam Case: పత్రాచల్ భూ కుంభకోణానికి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు సెప్టెంబరు 19 వరకు పొడిగిస్తూ ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఎ) కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గోరేగావ్ సబర్బన్‌లోని పత్రాచల్‌ను పునరాభివృద్ధి చేయడంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగస్టు 1న అరెస్టు చేసింది. మొదట్లో ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత శివసేన నాయకుడిని ఆగస్టు 8న 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆగస్ట్ 22న కోర్టు రౌత్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది, ఇప్పుడు దానిని సెప్టెంబర్ 19 వరకు పొడిగించారు.
ఈ కేసులో విచారణ ఇంకా పూర్తికానందున ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఇటీవల కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దరఖాస్తు చేసుకుంది. మరోవైపు సంజయ్ రౌత్ బెయిల్ కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే ఈడీ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం.. ఆయన కస్టడీని పొడగించింది. కాగా.. కస్టడీ సమయంలో సంజయ్ రౌత్ పార్లమెంట్ పత్రాలపై సంతకాలు చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఆ పత్రాల కాపీలను ఈడీ, కోర్టుకు సమర్పించాలని సూచించింది.
ఈడీ అధికారులు జూలై 31న శివసేన నాయకుడి ఇంటిపై దాడి చేసి, కొన్ని గంటలపాటు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఆగస్టు 1న అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్ 28న రూ. 1,034 కోట్ల పత్రాచల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజయ్ రౌత్‌కు సమన్లు జారీ చేసింది. తిరిగి ఆగస్టులో ఈ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ భార్యకు కూడా ఈడీ సమన్లు జారీచేసింది. ఈడీ అధికారులు శివసేన నాయకుడి ఇంటిపై దాడి చేసి సంజయ్ రౌత్‌ను చాలా గంటలపాటు నిర్బంధించి, ప్రశ్నించిన అనంతరం ఆయనను అరెస్టు చేసిన తర్వాత భార్య వర్షా రౌత్‌ను ఈడీ విచారించింది. రౌత్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు.
Supreme Court: ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని నిలిపివేయాలంటూ పిటిషన్.. విచారణకు సుప్రీం నిరాకరణ
ఇదిలా ఉండగా, శివసేన ఎంపీకి సన్నిహితుడిగా భావిస్తున్న సుజిత్ పాట్కర్ భార్య స్వప్న పాట్కర్‌ను బెదిరించినందుకు సంజయ్ రౌత్‌పై ముంబైలో మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 504,506, 509 సెక్షన్ల కింద వకోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్వప్నా పాట్కర్‌ను రౌత్ బెదిరిస్తున్నట్లు వినిపించిన ఆడియో క్లిప్ వైరల్ అయింది. ఈ కేసులో స్వప్నా పాట్కర్ సాక్షిగా ఉన్నారు.
