సంగారెడ్డి సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై టీజీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. న్యాయవాది కె.బాబూరావు సిగాచిపై పిల్ దాఖలు చేశారు. పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని, పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధితులకు ప్రకటించిన పరిహారం ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు.. పరిశ్రమ యజమానిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు.. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలి అని పిటిషనర్ పేర్కొన్నారు.
READ MORE: IND vs ENG Test: వరణుడి ఎఫెక్ట్.. నిలిచిన ఆట! భారత్ స్కోర్ ఎంతంటే.?
ఇదిలా ఉండగా.. గత నెల 30న తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం సంభవించింది. ఆరోజు ఉదయం హైదరాబాద్ నగర శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనం సంభవించింది. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో ప్రమాదం తీవ్రంగా జరిగిందని అంచనా వేశారు. బ్లో ఎయిర్ హ్యాండ్లర్‌ను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దుమ్ము పేరుకు పోయింది. దీంతో డ్రయ్యర్లో ఉష్ణోగ్రతలు అదుపులోకి రాకపోవడంతో పేలుడుకు దారి తీసి ఉంటుందని అంచనావేశారు.
READ MORE: AP Aqua Farming: ఆక్వా ఎగుమతులపై ట్రంప్ ఎఫెక్ట్.. రైతులపై మోయలేనంత పన్ను భారం!
సిగాచీ పరిశ్రమ ప్రమాదం విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది ఆచూకీ లభించడం కష్టమేనని గతంలో నిర్ణయానికి వచ్చారు. రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్‌లు పూర్తిగా కాలి బూడిదైపోయి ఉంటారని అనుకుంటున్నారు. ఆచూకీ లభించని ఆ 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని బాధిత కుటుంబాలకు చెప్పారు. డీఎన్‌ఏ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఇది వరకు 44 మృతదేహాలు గుర్తించిన విషయం తెలిసిందే.