Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి

Sangareddy Patancheru

Sangareddy Patancheru

Sangareddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో ఘోర విషాదం చోటుచేసుకుంది. నేరేడు చెరువులో వినాయక నిమజ్జనం చేయడానికి వెళ్లిన శిరీష అనాథాశ్రమానికి చెందిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. సరదాగా సాగాల్సిన నిమజ్జనం క్షణాల్లో విషాదాంతంగా మారడంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘటన పై సమాచారం అందుకున్న వెంటనే పటాన్‌చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పటాన్‌చెరులోని ప్రాచీన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధిత అనాథాశ్రమ నిర్వాహకులను పరామర్శించి, ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు అధికారులు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల వివరాలు తెలియజేశారు.

1. నర్సింహ రాజు
2. సుమంత్ (డిప్లొమా సెకండ్ ఇయర్)
3. గణేష్ (డిప్లొమా సెకండ్ ఇయర్)
4. ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్)
5. శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్ట్ ఇయర్)
6. సిద్దార్థ్ (10వ తరగతి)

ఇక, వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరిగే సమయంలో చెరువులు, నదీ తీరాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా నిమజ్జన ప్రాంతాలకు భారీగా జనం తరలివస్తారు కాబట్టి తొక్కిసలాట జరగకుండా వరుస క్రమాన్ని పాటించాలి. చిన్న పిల్లలను, వృద్ధులను నీటి ఒడ్డుకు దూరంగా ఉంచడం శ్రేయస్కరం. విగ్రహాలను నీటిలో కలిపేందుకు కేవలం నైపుణ్యం ఉన్న యువకులు లేదా రెస్క్యూ సిబ్బంది మాత్రమే ముందుకెళ్లాలి. నీటి లోతుపై అవగాహన లేకుండా లోతైన ప్రాంతాల్లోకి దిగడం ప్రమాదకరం. ప్రభుత్వం లేదా నిర్వాహకులు ఏర్పాటు చేసిన క్రేన్లు, ప్రత్యేక ఘాట్లను మాత్రమే నిమజ్జనం కోసం ఉపయోగించాలి. మత్తు పానీయాలు సేవించి నీట్లోకి దిగడం లేదా స్టంట్లు చేయడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. రాత్రి వేళల్లో తగినంత వెలుతురు ఉన్న ప్రాంతాలనే ఎంచుకోవాలి. విద్యుత్ వైర్లు, తాత్కాలిక షెడ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితుల కోసం ఈతగాళ్ళు, రక్షణ రబ్బరు పడవలు, ప్రథమ చికిత్స బృందాలు అందుబాటులో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ఈ పండుగను సురక్షితంగా, సంతోషంగా ముగించవచ్చు.