సమాజంలో జరిగే దారుణాలకు, నేరాలకు సినిమాలను బలిపశువులను చేయడంపై సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల జరిగిన రాప్తాడు ఘటన అనంతరం చాలా మంది యానిమల్, ధురంధర్ సినిమాల మీద విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. ఘోరమైన నేరాలు జరిగినప్పుడు బాధితుల పట్ల కనీస సానుభూతి చూపించకుండా, ఆ నెపాన్ని సినిమాలపై నెట్టేస్తూ కొందరు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా సినిమాల్లో చూపించే వైలెన్స్ వల్లే క్రైమ్స్ జరుగుతున్నాయంటూ తరచూ విమర్శలు గుప్పించే వారిపై ఆయన అత్యంత ఘాటైన పదజాలంతో ఫైర్ అయ్యారు. సినిమాలను టార్గెట్ చేసే వాళ్లకు బాధితుల కుటుంబాల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి, ఆవేదన లేదని సందీప్ తేల్చి చెప్పారు. “ఇండస్ట్రీలో సక్సెస్ కాలేక, అవకాశాలు రాక ఫ్రస్ట్రేషన్లో ఉన్న కొందరు పనికిమాలిన నటీనటులు, ఫెయిల్ అయిన డైరెక్టర్లు, నిర్మాతలు, పరాన్నజీవులు.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సడెన్‌గా సోషల్ రిఫార్మర్స్ (సంఘ సంస్కర్తలు) అవతారం ఎత్తుతారు. ఒకరి కష్టాన్ని, పనిని విమర్శించడానికి వాళ్లకు దొరికిన ఏకైక అవకాశం ఇది” అంటూ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇలాంటి ఘోరమైన విషాదాలను తమ స్కోర్ సెటిల్ చేసుకోవడానికి వాడుకోవడం అత్యంత నీచమైన చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో ఏదైనా దారుణం జరిగినప్పుడు ముందుగా బాధితుల పట్ల మానవత్వంతో స్పందించాలని, ఆ నేరానికి దారితీసిన అసలు మూలాలను, సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని సందీప్ సూచించారు. అంతేగానీ, సులువుగా తప్పించుకోవడానికి సినిమాను ఒక సాకుగా చూపించడం కరెక్ట్ కాదన్నారు. “విషాదం జరిగినప్పుడు కావాల్సింది సానుభూతి.. అవకాశవాదం కాదు. ముందు ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోండి” అంటూ తన విమర్శకులకు చురకలు అంటించారు. తాను తీసిన ‘యానిమల్’, ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో, తాజా క్రైమ్ ఘటనలకు కొందరు డైరెక్ట్‌గా సినిమా వాళ్లను టార్గెట్ చేస్తుండటంతో సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఈ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

