NTV Telugu Site icon

Sand Mafia: హైదరాబాద్‌లో ఇసుక మాఫియా.. పదివేలకు కొని యాభైవేలకు అమ్ముతున్న కేటుగాళ్లు

Sand Mafia

Sand Mafia

Sand Mafia: హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయం జోరుగా సాగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న మాఫియా అరాచకాలు మితిమీరుతున్నాయి. ఈ అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ విభాగం దృష్టి సారించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. జిల్లాలలోని ఇసుక రీచ్‌ల నుంచి లారీల ద్వారా ఇసుకను సరఫరా చేయించుకునే మాఫియా 10,000 రూపాయలకు ఒక లారీ ఇసుకను కొనుగోలు చేస్తోంది. అయితే, అదే ఇసుకను హైదరాబాద్‌లో 50,000 రూపాయలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోంది. ప్రధానంగా, నది తీర ప్రాంతాలకు డెలివరీ పేరుతో బుక్ చేసుకొని నిజానికి హైదరాబాదులో డంప్ చేస్తోంది.

Read Also: Maharashtra: మహాయుతి కూటమిలో చీలిక.. షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గింపు

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, తాడ్‌బండ్, అలాగే నగర శివారులో పలుచోట్ల ఇసుక డంప్ యార్డులు ఏర్పాటయ్యాయి. ఇవి అధికారికంగా గుర్తించబడని నిల్వ కేంద్రాలుగా మారాయి. టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇసుక అక్రమ నిల్వలను గుర్తించారు. ఇసుక అక్రమ డంపింగ్‌కి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, టాస్క్ ఫోర్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం మొదలైంది. అధికారుల చర్యలతో ఇసుక మాఫియాకు గట్టి ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంది.

అక్రమంగా ఇసుక నిల్వలు, రవాణా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, అవసరమైనట్టయితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజానికి నిర్మాణ రంగం కోసం ఇసుక అత్యవసరమైన వస్తువు. అయితే దాన్ని అక్రమ మార్గాల్లో నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం సామాన్య ప్రజలపై భారం పెడుతోంది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.