Salt Typhoon: తాజాగా వెలువడిన ఓ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అగ్రరాజ్యాన్ని… ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలని కలలు కంటున్న దేశానికి చెందిన ఓ ముఠా ముచ్చెమటలు పట్టిస్తుంది. నిజంగా చెప్పాలంటే.. తీవ్ర కలవరానికి గురి చేస్తుందనడం బాగుంటుంది. అమెరికాను భయపెడుతున్న ఆ పేరే.. ‘సాల్ట్‌టైపూన్’. ఈ ముఠా అమెరికాను మామూలు దెబ్బ కొట్టలేదు. దీని దెబ్బతో అమెరికాలోని ప్రతి ఒక్కరి డేటా డ్రాగన్ చేతిలోకి వెళ్లిపోయి ఉంటుందని భద్రతా నిపుణులు గజగజలాడిపోతున్నారు. సుమారుగా సంవత్సర కాలంగా దీనిపై దర్యాప్తు చేసిన నిపుణులు పలు కీలక విషయాలను గత వారం ఓ ప్రకటన రూపంలో బయటపెట్టారు. ఇంతకీ ఏంటా విషయాలు.. ఈ ముఠా ఏం చేసిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఆరు దేశాల సంతకాలతో వెలువడిన నివేదిక..
కీలక విషయాల ప్రకటనపై కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ దేశాలు సంతకాలు చేశాయి. ఈ హ్యాకర్ల ముఠాకు చైనా ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వ రవాణ, లాడ్జింగ్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్లను ఇది లక్ష్యంగా చేసుకుంటోందని తెలిపారు. ఈ దాడి పూర్తిగా అనియంత్రిత విధానంలో అన్నింటినీ లక్ష్యంగా చేసుకొంటుందని బ్రిటిష్, అమెరికన్ అధికారులు వెల్లడించారు. సాల్ట్ టైఫూన్ ముఠా 2019 నుంచి దాదాపు 80 దేశాల్లో 200 కంపెనీలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆ ముఠా ఇప్పటికే ప్రతి అమెరికన్ నుంచి సమాచారం దొంగిలించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది చైనా హ్యాకింగ్ సామర్థ్యాలను తెలియజేస్తోందని చెబుతున్నారు. ది సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీకి చెందిన సెనెటర్ మార్క్ వార్నర్ మాట్లాడుతూ.. సాల్ట్ టైఫూన్ దాడితో తమ హ్యాకింగ్ సామర్థ్యాలను ఇతరులకు తెలియజేయడంతో పాటు.. ప్రత్యర్థుల సైబర్ సామర్థ్యాలను అంచనా వేయడానికి కూడా చైనా ఉపయోగిస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ టార్గెట్ల కమ్యూనికేషన్స్, కదలికలను ఓ కంట కనిపెట్టడమే బీజింగ్ లక్ష్యంగా ఉందని చెప్పారు. సాల్ట్ టైఫూన్ బృందం ఫోన్ కాల్స్‌ను కూడా వినడం, ఎనిప్టెడ్ సందేశాలను చదవడం వంటివి చేయగలదని పేర్కొన్నారు.
‘సాల్ట్ టైపూన్’ గత కొన్నేళ్లుగా, అత్యంత సమన్వయ దాడి చేస్తోందని వెల్లడించారు. అది దాదాపు అనేక టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీల్లోకి చొరబడిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తాము అర్థం చేసుకొన్న దానికంటే ఈ దాడి చాలా పెద్దదిగా ఉండే అవకాశం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అపహరించిన డేటాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనికేషన్స్ నెట్వర్క్‌కి ‘సాల్ట్ టైపూన్’ చొరబడేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ముఠాకు మూడు కంపెనీలతో సంబంధాలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వీటికి చైనా సైన్యం, పౌర నిఘా ఏజెన్సీలతో సంబంధాలున్నాయని చెప్పారు. ఈ ఆరోపణలపై చైనా ఇంకా స్పందించలేదు.