మాజీ సీఎం వైఎస్ జగన్ విజన్‌తో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఉండాలన్నది సంకల్పించారని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలు వస్తే ఆరోగ్యశ్రీ ఖర్చులు తగ్గుతాయని జగన్ భావించారన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం అయితే ప్రభుత్వం ఉండి ఏం లాభం అని.. ఇది పీపీపీ కాదు, పెద్ద స్కామ్ అని ఫైర్ అయ్యారు. ఏదైనా ప్రైవేటుకు వెళ్తే ప్రజలకి నష్టమే అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
‘వైఎస్ జగన్ చాలా కృషి చేసి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేట్ పరం చేస్తానంటుంది. ప్రైవేటుపరం అయిపోతే పేదల పరిస్థితి ఏంటి?. విద్య, వైద్యం పూర్తిగా ప్రవేటు అయిపోతే ప్రభుత్వం ఉండి ఏం లాభం?. ప్రైవేట్ అత్యుత్తమం అని చంద్రబాబు చెప్పడం దారుణం. ప్రైవేట్ వాళ్ళు ఎందుకు సర్వీస్ చేస్తారు?. సొంతగా సర్వీస్ చేస్తే పర్లేదు ప్రభుత్వ ఆస్తులు కట్టబెట్టాక ఏంటి?. ఇది పీపీపీ కాదు పెద్ద స్కాం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. విభజన తర్వాత ఇంత స్పందన రావడం ఇదే మొదటిసారి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగ 1.4 కోట్ల సంతకాలు వచ్చాయి. ప్రజల స్పందనకి చంద్రబాబు కొంచం తగ్గారు. ప్రభుత్వ అనే పేరు ఉంటుంది అంటున్నాడు. పేరు ఒక్కటే ఉంటే ఏమి ఉపయోగం.. అన్ని ఇచ్చి ప్రైవేటుకి ఇవ్వడం ఏంటి?. రాష్ట్రంలో చాలా మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ప్రభుత్వం నడపడం లేదా?. రెండేళ్లు జీతాలు ఇస్తాం అంటున్నారు.. వాటికి అయ్యే ఖర్చుతో కాలేజీలు పూర్తి చెయ్యండి. ఏ విద్యార్థి అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదవాలని కోరుకుంటారు. అవసరం లేకపోయినా చంద్రబాబు ప్రైవేటీకరణను నెత్తిన పెట్టుకున్నాడు’ అని సజ్జల మండిపడ్డారు.
Also Read: CM Chandrababu: జనవరి నుంచి సీఎం చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు!
‘సీఎం చంద్రబాబు సిద్ధాంతమే ప్రవేటీకరణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. చంద్రబాబు ఇక్కడితో ఆగడు పీహెచ్సీలు కూడా ప్రయివేటుకు ఇస్తాను అంటాడు. చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాడు. కోటి నాలుగు లక్షల 11 వేల సంతకాలు వచ్చాయి. బ్యాలెట్ బాక్స్ లో ఓటు వేసినట్టే ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రజల నిర్ణయాన్ని చంద్రబాబు గౌరవించాలి.. కావాలి అంటే క్రెడిట్ నువ్వే తీసుకో. చంద్రబాబుకి క్రెడిట్ చోరీ చెయ్యడం అలవాటే కదా. చంద్రబాబు ఈ వయసులో ప్రజల ఉసురు పోసుకోవద్దు.. నిర్ణయం మార్చుకో. మిగిలిన రంగాల్లో ప్రైవేటీకరణ వేరు.. మెడికల్ కాలేజీలు వేరు. ఏదైనా ప్రైవేటుకు వెళ్తే ప్రజలకి నష్టమే. రోడ్లు పీపీపీలో జరుగుతున్నాయి, అందుకే టోల్ టాక్స్ భారీగా వసూల్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వస్తుంటే చార్జీల కంటే టోల్ టాక్స్ ఎక్కువ అవుతుంది. ప్రజలు సంతకాలు చేశారో లేదో ప్రజల్లోకి వెళ్లి తెలుసుకోండి. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం మంత్రులకి ఉందా?’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.
