NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: పోలవరంపై తెలంగాణ వైఖరి ఆడలేక మద్దెలోడు అన్నట్లుంది

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy comments on polavaram Height:పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని సజ్జల గుర్తుచేశారు. పోలవరం ఎత్తుపై తెలంగాణ వాదన అసంబద్ధంగా ఉందన్నారు. భద్రాచలానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రత్యేక ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే డిజైన్లు ఖరారు చేశారని సజ్జల తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ అభ్యంతరం లేవనెత్తే ప్రయత్నం చేస్తే సీడబ్ల్యూసీ తిరస్కరించిందన్నారు. ఆడలేక మద్దెలోడు అన్నట్లు ఉంది తెలంగాణ వైఖరి ఉందని సజ్జల ఎద్దేవా చేశారు. పోలవరానికి సంబంధించి ప్రతి అంశం కేంద్రం పరిధిలోనే జరుగుతోందని.. ఒక ఇంచ్ కూడా అటూ ఇటూ కాలేదన్నారు. కాఫర్ డ్యాం తాత్కాలిక నిర్మాణం.. దాని ప్రభావం కూడా ఉండదన్నారు. ప్రజల్లోకి ఒక స్టేట్ మెంట్ పంపి గందరగోళం సృష్టించే ప్రయత్నం మినహా మరొకటి కాదన్నారు.

Read Also: Minister Ambati Rambabu: పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదు

అటు మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా పోలవరం ఎత్తు వివాదంపై స్పందించారు. చట్టప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. బ్యాక్ వాటర్స్ వల్ల ఇబ్బందులు సహజం అని.. ఏ ప్రాజెక్టు కట్టినా బ్యాక్ వాటర్స్ వస్తాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. బ్యాక్ వాటర్స్ వచ్చాయని తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులు తీసేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయి కనుక నాలుగు ఓట్ల కోసం ఇలా రాజకీయాలు చేయటం కరెక్ట్ కాదని హితవు పలికారు. ముందు ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో పువ్వాడ అజయ్ చూసుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలు అంటించారు.