బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ బిలియనీర్ల వివాహ వేడుకలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ధనవంతుల పెళ్లిళ్లలో డ్యాన్స్ చేయనని, ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఇప్పటికీ ఇలాంటి వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తున్నప్పటికీ, తాను మాత్రం ఆ బాటలో నడవాలని అనుకోవడం లేదని వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో సరదాగా ఇలాంటి వాటిలో పాల్గొన్నప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు మారాయని.. బంధువులు కాని వారి పెళ్లిళ్లలో కేవలం ‘ఎంటర్‌టైనర్’గా డ్యాన్స్ వేయడం తనకు అసౌకర్యంగా అనిపిస్తోందని సైఫ్ ఓపెన్‌గా చెప్పుకొచ్చారు.
Also Read : Rashmika : బ్రేక్ తీసుకున్న రష్మిక మందన్న.. పోస్ట్ వైరల్
వయసు పెరగడంతో పాటు తన వ్యక్తిగత ఆలోచనలు మారడమే ఈ నిర్ణయానికి కారణమని సైఫ్ తెలిపారు. “మనం ఎవరికో తెలియని వారి పెళ్లిళ్లలో డ్యాన్స్‌లు వేస్తుంటే మన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు” అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో జరిగిన, ఒక భారీ బిలియనీర్ వివాహ వేడుకలో హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్ అందరూ సందడి చేసిన నేపథ్యంలో.. సైఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నటుడిగా తనకంటూ ఒక హుందాతనాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి
