Sai Pallavi: రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘రామాయణ’ విడుదల కాకముందే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. లాస్ ఎంజెల్స్‌లో జరిగిన ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ వేడుకలో ఆమె మాట్లాడిన మాటలు ఇంటర్నెట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అక్టోబర్ 27న జరిగిన ఈ ఈవెంట్లో సాయి పల్లవి భారతీయ సంస్కృతి, రామాయణ విశిష్టత గురించి ప్రస్తావిస్తూ.. భారతీయ సంస్కృతిని, ఇతిహాసాలను అర్థం చేసుకోవాలనుకునే వారికి ఈ సినిమా చక్కటి ఆరంభం అవుతుందని అభిప్రాయపడింది. రామాయణాన్ని కేవలం గ్రంథంగా నమ్మడమే కాకుండా, అందులోని ఆత్మ పరిశీలన చాలా ముఖ్యమని తెలిపింది. మనలోని మంచి చెడులను బేరీజు వేసుకుంటూ, కాలానికి తగినట్లుగా మనిషి తనను తాను మెరుగుపరుచుకోవాలని చెప్పింది.
ఈ క్రమంలోనే రావణాసురుడు కూడా పూర్తిగా చెడ్డవాడు కాదంటూ వ్యాఖ్యానించింది. “రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు. ఎంతో జ్ఞానం, మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో మనలో దాగి ఉన్న రావణుడిని (మనలోని చెడు ఆలోచనలను) మనం గుర్తించి, కాలక్రమేణా ఆ తప్పులను సరిదిద్దుకోవడమే అత్యంత ముఖ్యం. ఈ సినిమా చూశాక ఆ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలని కోరుకుంటున్నాను” అని సాయి పల్లవి విశ్లేషించింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం సాయి పల్లవి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. “స్త్రీని అపహరించిన వ్యక్తిని ఎలా సమర్థిస్తారు?” అంటూ కొందరు ఆమెపై మండిపడుతున్నారు. కానీ మరోవైపు కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో రావణుడిని పూజిస్తారని, శివ భక్తుడిగా, గొప్ప సంగీతజ్ఞుడిగా ఆయనలో ఎంతో గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదన్నది చారిత్రక, పౌరాణిక కోణంలోనూ సత్యమేనని, కొందరు పనిగట్టుకుని దీనిని వివాదం చేస్తున్నారని ఆమెను సమర్థిస్తున్నారు.

