Site icon NTV Telugu

Sachin Tendulkar: క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం

Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ మరో అరుదైన గౌరవం దక్కింది. సచిన్‌ టెండూల్కర్‌కు ఎంతో ఇష్టమైన, చివరి మ్యాచ్‌ ఆడిన, తన కెరీర్‌లో ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ నిలువెత్తు విగ్రహాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతిష్టించింది. ఇప్పటికే స్టేడియంలో సచిన్ పేరిట ఉన్న స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ స్ట్రెయిట్ డ్రైవ్ షాట్ కొడుతున్న పోజులో ఈ విగ్రహాన్ని రూపొందించారు. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత శిల్పి ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో సచిన్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, బీసీసీఐ సెక్రటరీ జై షా, ట్రెజరర్ ఆషిష్‌ షెలార్‌లతో పాటు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఎ) ప్రతినిధులు హాజరయ్యారు. త్వరలో శ్రీలంకతో భారత మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో సచిన్‌ విగ్రహావిష్కరణ జరగడం గమనార్హం.

Also Read: NZ vs SA: న్యూజిలాండ్‌ ఘోర ఓటమి.. అగ్రస్థానంలో దక్షిణాఫ్రికా

వాంఖడే స్టేడియంలో 2013 నవంబర్‌లో జరిగిన మ్యాచ్‌తో సచిన్‌ తన కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆనాడు సచిన్ చివరి మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా చూసేందుకు పోటెత్తిన అభిమానులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. అర్ధ సెంచరీతో ఆ మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన సచిన్ అభిమానుల నినాదాల నడుమ తన కెరీర్‌ను ముగించారు. సచిన్ రిటైర్ అయి పదేళ్లు కావస్తున్నప్పటికీ, ఆయన నెలకొల్పిన అనేక రికార్డులు ఇప్పటికీ ఎవరూ అధిగమించలేదు. టెస్టుల్లో 51 సెంచరీలు, వన్డేల్లో 49 సెంచరీలతో సచిన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా.. వాంఖడే స్టేడియంలో సచిన్‌ టెండూల్కర్‌ స్టాండ్‌కు ఆనుకుని ఉండే ఈ విగ్రహాన్ని ఎంసీఎ ఈ ఏడాది లిటిల్‌ మాస్టర్‌ 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి పూనుకుంది. సచిన్‌ 50వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంలో వాంఖెడేతో అతడికున్న అనుబంధానికి తోడు భారత క్రికెట్‌కు ఈ దిగ్గజం చేసిన సేవలకు గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు ఎంసీఎ గతంలోనే తెలిపింది.

Exit mobile version