SA20 2027 Schedule: దక్షిణాఫ్రికా ప్రీమియర్ టీ20 లీగ్ (SA20) 2027 ఐదో సీజన్ షెడ్యూల్‌ను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 21, 2027 వరకు ఈ టోర్నీ జరగనుంది. గత సీజన్ ఫైనల్‌లో తలపడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
SA20 ఐదో సీజన్‌కు జనవరి 17న గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు, గత సీజన్ రన్నరప్ ప్రిటోరియా క్యాపిటల్స్ తో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ సీజన్ ఫైనల్ ఫిబ్రవరి 21, 2027న కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరగనుంది. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి న్యూలాండ్స్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
లీగ్ దశ ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. మొత్తం టోర్నీ ఆరు వేదికల్లో నిర్వహించనున్నారు. అభిమానులను అలరించేలా నాలుగు శనివారం డబుల్ హెడర్లు కూడా షెడ్యూల్ చేశారు. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఎంఐ కేప్‌టౌన్ మరియు ప్రిటోరియా క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఇక లీగ్ మ్యాచుల తర్వాత ప్లేఆఫ్ జరగనుంది.
ప్లేఆఫ్ షెడ్యూల్ ఇలా..
ఫిబ్రవరి 16, 2027 – క్వాలిఫయర్-1 (బోలాండ్ పార్క్, పార్ల్).
ఫిబ్రవరి 17, 2027 – ఎలిమినేటర్ (వాండరర్స్, జోహన్నెస్‌బర్గ్).
ఫిబ్రవరి 19, 2027 – క్వాలిఫయర్-2 (వాండరర్స్, జోహన్నెస్‌బర్గ్).
ఫిబ్రవరి 21, 2027 – ఫైనల్ (న్యూలాండ్స్, కేప్‌టౌన్).
SA20 లీగ్ కమిషనర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. గత సీజన్ ఫైనల్‌ను మళ్లీ తొలి మ్యాచ్‌గా నిర్వహించడం కంటే మెరుగైన ప్రారంభం ఉండదన్నారు. “ప్రతి కొత్త సీజన్‌కు షెడ్యూల్ విడుదల కావడం మాకు ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. గత సీజన్ ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ మంచి ఆటను అందించాయి. అదే రెండు జట్లతో కొత్త సీజన్‌ను ప్రారంభించడం అభిమానులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది” అని స్మిత్ అన్నారు.
కేప్‌టౌన్ మేయర్ జియోర్డిన్ హిల్-లూయిస్ కూడా ఫైనల్‌కు మరోసారి ఆతిథ్యం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. SA20 ఫైనల్‌ను మరోసారి నిర్వహించడం కేప్‌టౌన్‌కు గర్వకారణం. ఇదే ఏడాది ICC పురుషుల వన్డే ప్రపంచకప్‌కు కూడా మా నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆటగాళ్లు, అభిమానులకు ఘన స్వాగతం పలికేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అని ఆయన అన్నారు. ఐపీఎల్ లాగే SA20 ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ లీగ్ ద్వారా దక్షిణాఫ్రికాకు అనేక మంది యువ ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు కూడా..

