తెలుగు కుర్రాడు తిలక్ వర్మ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర విషయం చెప్పాడు. రెండో టీ20 అనంతరం తిలక్ తన వద్దకు వచ్చి.. మూడో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతానని చెప్పాడన్నాడు. తనను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్.. సెంచరీతో సత్తా చాటాడని సూర్య తెలిపాడు. చివరివరకూ ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందంగా ఉందన్నాడు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20లో తిలక్ వర్మ సెంచరీ (107 నాటౌట్; 56 బంతుల్లో 8×4, 7×6) బాదాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో విజయం సాధించడం ఆనందంగా ఉంది. టీమ్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నామో వాటిని మైదానంలో అమలు చేశాం. మ్యాచ్‌లో ఓడినా, గెలిచినా బ్రాండ్ క్రికెట్ ఆడేందుకే ప్రయత్నిస్తామని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. మా ప్లేయర్స్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. దూకుడుతో పాటు మ్యాచ్‌లో విజయం సాధించాలనే ఉద్దేశం ఉంటేనే ఇలాంటి ఫలితాలు వస్తాయ్. బ్యాటర్లు, బౌలర్లు రాణించారు. దాంతో నా పని సులువైంది. మొదటిసారి మేము మైదానంలో 6-7 నిమిషాల ముందు ఉన్నాం’ అని చెప్పాడు.
Also Read: Koti Deepotsavam 2024: వైకుంఠ చతుర్దశి వేళ.. కోటి దీపోత్సవంలో ఆరవ రోజు కార్యక్రమాలు ఇవే!
‘తిలక్ వర్మ బాగా ఆడాడు. అతడిని ఎంత పొగిడినా తక్కువే. గెబేరాలో రెండో టీ20 జరిగిన తర్వాత తిలక్ నా రూమ్‌కు వచ్చాడు. మూడో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతానని నాతో చెప్పాడు. తప్పకుండా రాణిస్తాననే నమ్మకం ఉందన్నాడు. అందుకు నేను ఓకే చెప్పాను. నన్ను అడిగి మరీ ఛాన్స్ తీసుకున్న తిలక్.. సెంచరీతో రాణించాడు. తిలక్‌తో పాటు కుటుంబసభ్యులూ ఆనందపడి ఉంటారు. ప్లేయర్స్ రాణిస్తున్నపుడు సారథిగా నాక్కుడా ఆనందం కలుగుతుంది’ అని సూర్యకుమార్ చెప్పాడు. టీ20ల్లో సాధారణంగా వన్‌డౌన్‌లో సూర్యకుమార్ వస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో తిలక్ ముందుకొచ్చి సెంచరీ కొట్టాడు.