ఐపీఎల్ 2024లో అదరగొట్టిన వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు టీ20 ప్రపంచకప్ 2024లో చోటు దక్కింది. మెగా టోర్నీకి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ప్రపంచకప్ అనంతరం శ్రీలంక పర్యటనలో వచ్చిన రెండు అవకాశాలను వృథా చేసుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో సెంచరీ చేసిన సంజూ.. ప్రస్తుతం జరుగుతున్న దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు.
సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. దీంతో వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు సాధించిన టీమిండియా బ్యాటర్‌గా నిలిచాడు. ఇక రెండో, మూడో టీ20ల్లో డకౌట్ అయిన సంజూ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. గెబేరాలో జరిగిన రెండో మ్యాచ్‌లో డకౌట్ అయిన ఈ కేరళ బ్యాటర్.. సెంచూరియన్‌లోనూ 0కే ఔటయ్యాడు. దీంతో వరుసగా రెండు సెంచరీలు, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో డకౌట్ అయిన తొలి బ్యాటర్‌గా ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకొన్నాడు.
Also Read: Gold Rate Today: వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
సంజూ శాంసన్ మరో చెత్త రికార్డును సైతం నెలకొల్పాడు. 2024లో ఐదుసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గానూ నిలిచాడు. జింబాబ్వే బ్యాటర్ రెగిస్ చకబ్వా (2022) ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఐదుసార్లు డకౌట్ అయ్యాడు. చివరి టీ20లో అయినా సంజూ మెరిస్తేనే భారత జట్టులో చోటు ఉంటుంది. ఇప్పటికే అతడు చాలా అవకాశాలను వృధా చేసుకున్నాడు. భారత్ తరపున 36 టీ20లు ఆడిన సంజూ.. 701 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 111.