Site icon NTV Telugu

TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సంకేతాలు

Tgsrtc

Tgsrtc

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (RTC)లో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధికార యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన RTC JAC, తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమవుతోంది.

ఆర్టీసీ యాజమాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. లేబర్ కమిషనర్‌తో చర్చలు జరిపే అవకాశం కల్పించినా, ఆర్టీసీ యాజమాన్యం అందులో పాల్గొనకపోవడంతో చర్చలు జరగకుండానే RTC JAC నేతలు వెనుదిరిగారు. ఇది ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ, తమ వాదనలకు మద్దతుగా చర్యలు తీసుకోకపోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను కారణంగా చూపుతున్న యాజమాన్యం, కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం నుండి తప్పించుకుంటోందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో పురోగతిలేదు. ఇంకా చాలా మంది ఉద్యోగులకు పూర్తిగా జీతాలు కూడా పడని పరిస్థితి నెలకొంది. విలీన ప్రక్రియ గురించి ఎటువంటి ప్రకటన లేకుండా, ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా పెండింగ్ బిల్లుల గురించి కూడా ఎవరూ స్పందించకపోవడంతో సమస్యలు మరింత పెరిగినట్లయ్యింది.

ఈ పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో పాటు, RTC బస్సులను రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేయాలని, ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని, విలీన ప్రక్రియను పూర్తిచేయాలని RTC JAC నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇవేవీ పరిష్కారం కాదనే అభిప్రాయంతో, వచ్చే నెల 7వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం వెంటనే చర్చలకు రావలసిన అవసరం ఉందని, లేదంటే RTC సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని కార్మికులు హెచ్చరిస్తున్నారు.

Mark Shankar: పవన్‌ కుమారుడికి గాయాలు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్‌, రోజా..

Exit mobile version