Fight at Bus: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించే ప్రజలు భద్రంగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే కొంతమంది విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఇతరుల ప్రయాణాన్ని నరకంగా మార్చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు చేసిన వీరంగం, యువతుల ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. వేములవాడ నుంచి సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ వ్యక్తికి యువతులు తగిన గుణపాఠం చెప్పారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సిద్దిపేట డిపోకు చెందిన బస్సు, వేములవాడ నుంచి బయలుదేరి వస్తుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ వ్యక్తి బస్సులో ఎక్కాడు. మొదట్లో సాధారణంగానే ఉన్న ఆ వ్యక్తి, తంగళ్ళపల్లి మండలం సారంపల్లి సమీపానికి వచ్చేసరికి మద్యం మత్తులోకి వెళ్లాడు.
ఈ క్రమంలోనే.. బస్సులో ప్రయాణిస్తున్న యువతులపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఆ యువతులు ధైర్యంగా ఎదురుతిరిగిన వెంటనే, అతడు వారిపై దాడికి కూడా ప్రయత్నించాడు. అయితే, అతని దౌర్జన్యాన్ని భరించలేక యువతులు కలిసి అతనిపై దేహశుద్ధి చేశారు. ఈ ఘటనను గమనించిన డ్రైవర్, తక్షణమే బస్సును ఆపి సదరు తాగుబోతును బస్సు నుంచి బయటకు పంపించాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతుల ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. “ఇలాంటి ఘటనల్లో భయపడకుండా ఎదురుగా నిలవాల్సిందే” అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం… “ఇలాంటి ప్రవర్తనలపై చర్యలు తీసుకునేలా ఆర్టీసీకి ప్రత్యేక గైడ్‌లైన్లు అవసరం” అని సూచిస్తున్నారు.
HIT 3: నాని ‘రా’ సినిమాకి సెన్సార్ కష్టాలు?