Corona BF7: కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి కరోనా విజృంభిస్తున్న దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. చైనాతో పాటు హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్ నుంచి వచ్చే వారు ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని గురువారం కేంద్రం తెలిపింది. అలాగే ప్రయాణికులు ప్రయాణాలకు ముందు.. ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఆ రిపోర్ట్‌లను అప్‌లోడ్ చేయాల్సిందేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. లేకుంటే భారత్‌లోకి ఎంట్రీ ఉండబోదని స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి ఈ ఆరు దేశాల్లో కేసులు వెల్లువలా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: Bandi Sanjay: మిషన్ 90 ప్లాన్.. పక్కా అధికారం మాదే అంటున్న బీజేపీ
లక్షణాలు ఉన్న వారిని, వ్యాధి నిర్ధారణ అయిన వారిని క్వారంటైన్‌లో ఉంచుతామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవ్య తెలిపారు. గత శనివారం నుంచి విమానాశ్రయాల్లో తనిఖీలు ప్రారంభమయ్యాయి. చైనా, జపాన్, థాయ్‌లాండ్, హాంకాంగ్, దక్షిణ కొరియా నుండి వచ్చే ప్రయాణికులందరికీ RTPCR పరీక్షలు నిర్వహించారు. 6000 మందిని పరీక్షించగా, గత రెండు రోజుల్లో 39 మందికి కోవిడ్ ఉన్నట్లు నిర్ధారించబడింది. న్యూఇయర్‌తో పాటు పండుగల ప్రయాణాల నేపథ్యంలో వైరస్ వ్యాప్తి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న 40రోజులు దేశంలో కీలకం కానున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతకుముందు, రాష్ట్రాలలో కూడా తనిఖీ, నిఘా పెంచాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Asteroid: 51వేల కి.మీ. వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న ఆస్టరాయిడ్
మరోవైపు ప్రస్తుతం విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియెంట్ తీవ్రత తక్కువే కావడంతో భారత్‌లో మరో వేవ్ ఉండకపోవచ్చని, పేషెంట్లు ఆస్పత్రుల పాలుకావడం.. మరణాలు ఎక్కువగా సంభవించకపోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. కాకపోతే.. వైరస్ వ్యాప్తి త్వరగతిన ఉంటుందని భావిస్తోంది. మరోవైపు నిపుణులు చైనాలో మాదిరి తీవ్ర పరిస్థితులు భారత్‌లో నెలకొనకపోవచ్చని, అందుకు వ్యాక్సినేషన్ డ్రైవ్, ప్రజల్లో రోగ నిరోధక కారణాలని చెబుతున్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.