Rohit Sharma wife Ritika Sajdeh Comment On Mark Boucher’s Interview over MI Captaincy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు ముందు ముంబై ఇండియన్స్ ప్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడ్ చేసుకున్న ముంబై.. 2013 నుంచి కెప్టెన్‌గా వ్యవహిరించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. హార్దిక్‌కు ముంబై జట్టు పగ్గాలు అప్పగించడంతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో రోహిత్ ఫాన్స్ ముంబై యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా రోహిత్ సతీమణి రితికా చేసిన కామెంట్స్ ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయనే అనుమానాలకు తావిస్తోంది.
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గల కారణాలను వివరించాడు. ‘హార్దిక్ పాండ్యాను ఆటగాడిగా కొనసాగించాలనే మేం ముందుగా భావించాం. అయితే ప్రస్తుతం ముంబై టీమ్ పరివర్తన చెందే దశలో ఉంది. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అభిమానులు తీవ్ర భావోద్వేగాలకు లోనవుతున్నారు. టీం కోసం ఉద్వేగాలకు అతీతంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయం. రోహిత్ శర్మలోని ఆటగాడిని అత్యుత్తమ స్థాయిలో చూడాలనుకుంటున్నాం. హిట్‌మ్యాన్ ఆటను ఆస్వాదిస్తూ.. స్వేచ్ఛగా రన్స్ చేయనివ్వండి’ అని బౌచర్ అన్నాడు.
మార్క్ బౌచర్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రోహిత్ శర్మ సతీమణి రితికా స్పందించారు. ‘ఇందులో చాలా విషయాలు తప్పు’ అని రితక కామెంట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అయింది. మరోసారి ముంబై యాజమాన్యంపై విమర్శలు మొదలయ్యాయి. రోహిత్ కెప్టెన్సీపై ఉద్దేశపూర్వకంగానే ముంబై ఫ్రాంచైజీ వేటు వేసిందని హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. 2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ నియమించబడ్డాడు. అదే ఏడాది ముంబైకి మొదటి ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఆపై రోహిత్ సారథ్యంలో ముంబై 2015, 2017, 2019, 2020లో టైటిల్స్ అందుకుంది. అయితే గత మూడు సీజన్‌లలో ముంబై పేలవ ప్రదర్శన చేసింది. 2021, 2022లో గ్రూప్ దశ నుంచే ఇంటిదారి పట్టిన ముంబై.. 2023లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.
Also Read: Team India Coach: టీమిండియా కోచ్‌గా వచ్చేందుకు ఎప్పుడూ సిద్దమే: గ్యారీ కిరిస్టెన్
2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ కెరీర్ మొదలు పెట్టిన హార్దిక్ పాండ్యా.. 2021 వరకూ అదే జట్టులో ఉన్నాడు. ఈ క్రమంలో మంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్న హార్దిక్‌ను ముంబై వదిలేసింది. 2022 వేలంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. హార్దిక్‌ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించింది. హార్దిక్ సారథ్యంలో 2022లో టైటిల్ గెలిచిన గుజరాత్.. 2023లో రన్నరప్‌గా నిలిచింది. అనూహ్యంగా గుజరాత్ కెప్టెన్సీ వదులుకుని ముంబై జట్టులో చేరాడు.