NTV Telugu Site icon

KL Rahul: టాస్‌కు 5 నిమిషాల ముందు చెప్పాం.. అయినా రాహుల్‌ అద్భుతంగా ఆడాడు: రోహిత్‌ శర్మ

Rohit Smile

Rohit Smile

Rohit Sharma Heap Praise on KL Rahul after Hits Century in IND vs PAK Match: పాకిస్తాన్ మ్యాచ్ ఆడుతున్నావని గాయం తర్వాత జట్టులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌కు టాస్‌కు 5 నిమిషాల ముందు చెప్పాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి బరిలోకి దిగిన రాహుల్.. తన ప్రదర్శనతో అకట్టుకున్నాడన్నాడు. మైదాన సిబ్బంది వల్లే పాకిస్థాన్‌పై విజయం దక్కిందని రోహిత్ తెలిపాడు. ఆసియా కప్‌ 2023 సూపర్‌-4లో భాగంగా కొలంబో వేదికగా దయాది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన అన్ని విభాగాల్లో ఆకట్టుకుంది.

మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ… ‘క్రీజులో ఎక్కువ సేపు గడపాలని ముందే అనుకున్నాం. టైమ్ తీసుకుని చెలరేగాం. చాలా మంది ఆటగాళ్లు ఇలా చేయరు. ఈ మ్యాచ్ జరగడానికి ప్రధాన కారణం గ్రౌండ్స్‌మెన్. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కవర్లు కప్పుతూ.. ఆపై తీయడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. రెండు రోజుల పాటు కొలొంబో మైదాన సిబ్బంది బాగా కష్టపడ్డారు. మా జట్టు తరఫున వారందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గ్రౌండ్స్‌మెన్ కష్టం వల్లే మాకు ఈ విజయం దక్కింది’ అని అన్నాడు.

Also Read: Virat Kohli: నేను చాలా అలసిపోయాను.. ప్లీజ్ ఎక్కువ ప్రశ్నలు అడగకండి: విరాట్ కోహ్లీ

‘మా బ్యాటింగ్ విభాగం చెలరేగింది. ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తే.. అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్ భారీ ఇన్నింగ్స్‌ ఆడారు. మేము ప్రారంభించినప్పుడు వికెట్ చాలా బాగుంది.. కానీ వర్షం పడింది. వర్షం పడుతుంది కాబట్టి రన్ రేట్ మెయింటైన్ చేసాం. జస్ప్రీత్ బుమ్రా బాగా బౌలింగ్ చేశాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేశాడు. గత 8-10 నెలలుగా బుమ్రా తీవ్రంగా కష్టపడ్డాడు. 27 ఏళ్ల బుమ్రా తరుచూ జట్టుకు దూరమవ్వడం మంచిది కాదు. ఈ మ్యాచ్‌లో ఎలా బ్యాటింగ్ చేయాలనుకున్నామో అలానే చేశాం. ముఖ్యంగా కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. టాస్‌కు 5 నిమిషాల ముందు మ్యాచ్ ఆడుతున్నావ్ అని చెప్పాము. అలా జట్టులోకి వచ్చి ఇలా సెంచరీతో చెలరేగడం అద్భుతం’ అని రోహిత్ శర్మ ప్రశంసించాడు.