NTV Telugu Site icon

Rohit Sharma: ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకుంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: రోహిత్‌ శర్మ

Rohit Sharma Interview Odi

Rohit Sharma Interview Odi

Rohit Sharma Interview Goes Viral Ahead of Asia Cup 2023: ప్రపంచకప్‌ జట్టులో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. బాగా ఆడినా కూడా కొన్నిసార్లు జట్టులో చోటు దక్కదు. జట్టు కూర్పు కారణంగా ఇలా జరుగుతుంటుంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు 2011 వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు. దాంతో ఎంతో బాధతో గదిలో కూర్చుని ఏడ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ఆనాటి చేదు జ్ఞాపకాలను రోహిత్ గుర్తుచేసుకున్నాడు. బెంగళూరులో ఆసియా కప్‌ 2023 శిబిరంలో చేరడానికి ముందు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ పలు విషయాలు పంచుకున్నాడు.

‘2011 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించాక నేను నా గదిలో భాదతో కూర్చుని ఉన్నా. ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలో యువరాజ్‌ సింగ్ నన్ను తన గదికి పిలిచాడు. ఇద్దరం కలిసి డిన్నర్‌కు వెళ్లాం. ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకుంటే ఎంత బాధ ఉంటుందో చెప్పాడు. నువ్వు ఇంకా చాలా ఏళ్లు క్రికెట్‌ ఆడగలవు, బాగా కష్టపడు అని సలహా ఇచ్చాడు. నైపుణ్యాలను పెంచుకుని జట్టులోకి వస్తే.. నువ్వు మళ్లీ భారత్‌కు ఆడకుండా ఉండే అవకాశం లేదన్నాడు. నీకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం తప్పక వస్తుందని యువీ చెప్పాడు’ అని రోహిత్ శర్మ తెలిపాడు.

‘అనుకూల లేదా ప్రతికూల బయటి అంశాల గురించి ఆలోచించకోకుండా నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకుంటా. బయటి వార్తలను పూర్తిగా విస్మరిస్తా. ప్రపంచకప్‌ 2019కు ముందు ఉన్న దశలోకి వెళ్లాలనుకున్నా. ఆ టోర్నీలో నేను మానసికంగా గొప్ప స్థితిలో ఉన్నా. బాగా సన్నద్ధమయ్యా. ప్రపంచకప్‌ 2023లోనూ అదే స్థితిలోనే ఉండాలనుకుంటున్నా. నాకు ఇంకా సమయం ఉంది. 2019 ప్రపంచకప్‌కు ముందు ఓ క్రికెటర్‌గా, ఓ వ్యక్తిగా నేను చేసిన పనులేంటో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

Also Read: Asia Cup 2023: ఓపెనర్లుగా గిల్‌, ఇషాన్‌.. నాలుగో స్థానంలో రోహిత్‌! తుది జట్టు ఇదే

‘మంచి కూర్పును ఎంచుకునే సమయంలో పలు కారణాల వల్ల కొందరు ప్లేయర్స్ జట్టులో చోటు కోల్పోతారు. రాహుల్ ద్రవిడ్‌, నేను వాళ్లెందుకు జట్టులో లేరో వివరించడానికి ప్రయత్నిస్తాం. సెలక్షన్‌ తర్వాత, తుది జట్టును ప్రకటించాక మేం ఆటగాళ్లతో మాట్లాడతాం. వాళ్లనెందుకు తీసుకోలేదో ముఖాముఖితో చెబుతాం. కొన్నిసార్లు నేను కూడా వాళ్ల స్థానంలో ఉండి ఆలోచిస్తా. ప్రపంచకప్‌ 2011కు ఎంపిక కానప్పుడు నా గుండె బద్ధలైంది. ప్రత్యర్థి, పిచ్‌లు, మా బలాలు, వాళ్ల బలహీనతలు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నేను, కోచ్‌లు, సెలక్టర్లు కలిసి ఒక అభిప్రాయానికి వస్తాం. మా నిర్ణయాలు తప్పయ్యే అవకాశం ఉంటుంది. మనుషులన్నాక తప్పులు చేయడం సహజం. మేం అన్నిసార్లూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. నా వ్యక్తిగత ఇష్టాయిష్టాల ఆధారంగా ఆటగాళ్లను ఎంచుకోవడం జరగదు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.