Site icon NTV Telugu

Rohit Sharma: ఏవేవో ఆలోచనలు.. కాళ్లు, చేతులు ఆడలేదు!

Rohit Sharma

Rohit Sharma

దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్‌కు ముందు రోజు తీవ్ర ఒత్తిడికి గురయ్యానని అప్పటి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. ఏవేవో ఆలోచనలతో తన కాళ్లు, చేతులు ఆడలేదని.. ఆ రోజు రాత్రి నిద్రపోలేదని చెప్పాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్‌ కొట్టిన షాట్‌ కచ్చితంగా సిక్స్ పోతుందనుకున్నా అని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడని ప్రశంసించాడు. కీలక సమయంలో రిషబ్‌ పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా అని, అయితే బ్యాటర్ల లయను దెబ్బ తీసేందుకు అలా చేశాడని తర్వాత అర్థమైందని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. బార్బడోస్‌లో ఉత్కంఠ భరితంగా సాగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి కప్ కైవసం చేసుకుంది.

టీమిండియా టీ20 ప్రపంచకప్‌ 2024 గెలిచి జూన్‌ 29కి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ‘భారత్ 2011లో ప్రపంచకప్‌ గెలిచింది. ఆ తర్వాత టీమిండియా ప్రపంచకప్‌ గెలవలేదు. ఇది 13 ఏళ్ల విరామం. చాలా మంది ఆటగాళ్లకు 13 ఏళ్ల కెరీర్‌ కూడా ఉండదు. అలాంటి వారికి ప్రపంచకప్‌ కల నెరవేరదు. నేను 2007 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నా. టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్‌ను మించింది లేదనిపించింది. ఫైనల్ మ్యాచ్ ముందు రోజు రాత్రి నిద్ర పోలేదు. ఏవేవో ఆలోచనలతో నా కాళ్లు, చేతులు ఆడలేదు. నా మనసంతా ప్రపంచకప్‌ మీదే ఉంది. అదే సమయంలో ఒత్తిడిగా కూడా అనిపించింది. మ్యాచ్ కోసం ఉదయం 9 గంటల కల్లా టీమ్ బయల్దేరాలి, కానీ నేను 7 గంటలకే నిద్రలేచా. నా రూమ్ నుంచి మైదానాన్ని చూస్తూ.. మరో రెండు గంటల్లో మైదానంలో ఉంటాం, ఆపై కొన్ని గంటలకే ఫలితం వస్తుంది. కప్‌ ఎవరిదో’ అనే ఆలోచనలు నా మదిలో వచ్చాయి’ అని రోహిత్‌ చెప్పాడు.

‘ఫైనల్లో చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్‌ కొట్టిన షాట్‌ను సూర్యకుమార్ అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. అప్పుడే మ్యాచ్‌ భారత్‌ వైపు మొగ్గింది. అయితే నేను ఆ బంతి సిక్స్‌ అనుకున్నా. సూర్య పట్టిన క్యాచ్‌ సరైనదో లేదో తేల్చడానికి థర్డ్‌ అంపైర్‌కి ఫీల్డ్ అంపైర్లు పంపారు. ఆ సమయంలో టీమ్ మొత్తం తీవ్ర ఒత్తిడికి గురైంది. సూర్యా అది క్యాచేనా అని నేను అడిగా?. బంతిని బాగా పట్టానని సూర్య చెప్పాడు. రీప్లేలో సూర్య అద్భుతంగా బంతిని అందుకున్నాడని కనిపించింది. అందరం సంతోషంలో మునిగిపోయాం. నిజానికి ఆ క్యాచ్‌ సూర్య పట్టకుంటే కచ్చితంగా సిక్స్‌ వెళ్లేదే. కీలక సమయంలో పంత్‌కు గాయం అయిందని కంగారు పడ్డా. కానీ బ్యాటర్ల లయను దెబ్బ తీసేందుకు అలా చేశాడని తర్వాత అర్థమైంది’ అని రోహిత్‌ తెలిపాడు.

Exit mobile version