NTV Telugu Site icon

ICC T20: ఐసీసీ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024 కెప్టెన్‌గా ‘హిట్ మ్యాన్’..

Rohit Sharma

Rohit Sharma

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం 2024 పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ని ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్ సారథ్యంలో భారత్ గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 గెలుచుకుంది. 2024 సంవత్సరంలో అత్యుత్తమ టీ20 జట్టుగా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఈ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. రోహిత్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా , పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. కాగా.. ఈ జట్టులో ఏకైక పాకిస్థానీ ప్లేయర్ బాబర్ ఆజంకు స్థానం లభించింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, వెస్టిండీస్‌లకు చెందిన ఒక్కో ఆటగాడు ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.

రోహిత్ శర్మ మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్ కెప్టెన్‌గానే కాకుండా ఓపెనర్‌గా కూడా ఉన్నాడు. గత సంవత్సరం, అతను 11 టీ20 మ్యాచ్‌లలో 42.00 సగటు, 160.16 స్ట్రైక్ రేట్‌తో 378 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ కరువుకు తెరపడింది. కాగా.. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం భారత టెస్టు, వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు.. బుమ్రా 2024లో 8 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా.. భారత్‌ను ఛాంపియన్‌గా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

Read Also: Vijayasai Reddy: విజయసాయి రెడ్డి రాజీనామాకు రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం..

హార్దిక్ పాండ్యా.. గతేడాది 17 టీ20 మ్యాచ్‌లు ఆడి 352 పరుగులు చేయడంతోపాటు 16 వికెట్లు కూడా తీశాడు. టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో అతను 16 పరుగులతో డిఫెండ్ చేశాడు. 2024లో పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. 18 మ్యాచ్‌ల్లో 13.50 సగటుతో 36 వికెట్లు తీశాడు. అతను టీ20 ప్రపంచ కప్‌లో (8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) ఉమ్మడి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. గత ఏడాది 24 టీ20 మ్యాచ్‌లు ఆడి 3.54 సగటుతో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ 738 పరుగులు చేయడం గమనార్హం. అతని అత్యధిక స్కోరు 75. అతని బ్యాట్ నుండి ఆరు అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు వచ్చాయి.

2024 మెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్: రోహిత్ శర్మ (కెప్టెన్, భారత్), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్), బాబర్ ఆజం (పాకిస్థాన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్, వెస్టిండీస్), సికందర్ రజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (భారత్), రషీద్ ఖాన్ ( ఆఫ్ఘనిస్తాన్), వనిందు హసరంగా (శ్రీలంక), జస్ప్రీత్ బుమ్రా (ఇండియా), అర్ష్దీప్ సింగ్ (ఇండియా).