టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని చూస్తున్నాడు. ఎందుకంటే.. వన్డే ప్రపంచకప్ రోహిత్ కల అని తెలిసిందే. టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు పూర్తిగా వన్డేలపై మాత్రమే దృష్టి పెట్టాడు. అయితే రోహిత్‌ను టీమ్ నుంచి తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశాడు. హిట్‌మ్యాన్‌ను తప్పించేందుకే బ్రాంకో టెస్ట్ తీసుకొచ్చారని అభిప్రాయపడ్డాడు.
భారత జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం యోయో పరీక్ష ఉన్న విషయం తెలిసిందే. యోయో టెస్ట్ క్లియర్ చేస్తేనే జట్టులో చోటు దక్కుతుంది. యోయో టెస్టుతో పాటు త్వరలో బీసీసీఐ బ్రాంకో టెస్టునూ ప్రవేశ పెట్టనుంది. ఆటగాళ్లలో ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంచడం కోసం స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లి రాక్స్ ఈ టెస్టును తీసుకొచ్చాడు. ఇకపై ఓ ప్లేయర్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని నిరూపించుకోవాలంటే.. యోయోతో పాటు బ్రాంకో టెస్టులోనూ పాస్ కావల్సి ఉంటుంది. బ్రాంకో టెస్టు నిర్ణయంపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చుస్తున్నారు. మరికొందరి బీసీసీఐపై మండిపడుతున్నారు కూడా. రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తప్పించడానికే బ్రాంకో టెస్ట్‌ను ప్రవేశపెట్టారని మనోజ్ తివారీ అంటున్నాడు.
క్రిక్‌ట్రాకర్ ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ మాట్లాడుతూ… ‘నా ఉద్దేశం ప్రకారం.. గౌతమ్ గంభీర్, భారత జట్టు యాజమాన్యం రోహిత్ శర్మ వంటి ఆటగాళ్ల కోసమే బ్రోంకో టెస్ట్‌ను ప్రవేశపెట్టింది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ ఉంచుకోకూడదని కోరుకుంటున్నారు. ప్రపంచకప్ ప్రణాళిక నుంచి విరాట్ కోహ్లీని పక్కకు పెట్టడం అంత ఈజీ కాదు. కానీ రోహిత్‌ను వారు తప్పించాలనుకుంటున్నారు. భారత ఇటీవలి కాలంలో క్రికెట్‌లో ఏం జరుగుతుందో నేను పరిశీలిస్తున్నా. భవిష్యత్తులో రోహిత్‌ను వన్డే జట్టు నుంచి దూరం చేయడం కోసమే ఈ బ్రాంకో టెస్ట్‌ను తెచ్చారు. ఇదంతా ఓ పథకం ప్రకారం జరుగుతోందనే సందేహం నాకు ఉంది’ అని ఆరోపించాడు.
Also Read: Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 35 మందికి పైగా..!
‘బ్రాంకో టెస్ట్ అత్యంత కఠినమైన ఫిట్‌నెస్ పరీక్ష. ఈ టెస్ట్‌ను ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టారనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ టెస్టును మొదటి సిరీస్ నుంచే ఎందుకు అమలు చేయలేదు?, ఇది ఎవరి ఆలోచన?, బ్రాంకో టెస్ట్ ఎవరు ప్రవేశపెట్టారు అనే ప్రశ్నలు నా మదిలో మెదులుతున్నాయి. ఏదేమైనా రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాల్సిందే. లేకపోతే బ్రాంకో టెస్ట్ పాసవడం అంత తేలిక కాదు’ అని మనోజ్ తివారీ చెప్పాడు. బ్రాంకో టెస్ట్ అంటే పరుగు పరీక్ష. ప్లేయర్ విరామం లేకుండా ఆరు నిమిషాల వ్యవధిలో 1200 మీటర్లు పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ ఎక్కువగా రగ్బీలో వాడతారు.
