Site icon NTV Telugu

IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన రో-కో!

Rohit Sharma, Virat Kohli

Rohit Sharma, Virat Kohli

టీమిండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కొహ్లీ, రోహిత్‌ శర్మలు చివరగా భారత జెర్సీల్లో కనిపించి 223 రోజులైంది. ఇద్దరు దిగ్గజాలు గత మార్చిలో ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్లో ఆడారు. సుదీర్ఘ విరామం తర్వాత రో-కోలను అంతర్జాతీయ క్రికెట్లో చూడబోతున్నామని ఫాన్స్ సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీలు పూర్తిగా నిరాశపర్చారు.

రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ వేసిన 4 ఓవర్లోని నాలుగో బంతిని ఆడబోయి స్లిప్‌లో రెన్‌షాకు దొరికిపోయాడు. ఆపై క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొన్నా పరుగుల ఖాతా తెరవలేదు. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో కనోలీ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో విరాట్ పెవిలియన్‌కు చేరాడు. దాంతో 21 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది. రో-కోలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ అవుట్ అయిన కాసేపటికే కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ (10) కూడా పెవిలియన్‌కు చేరాడు. ఎల్లిస్‌ వేసిన బంతిని లెగ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన గిల్.. వికెట్ కీపర్‌ సూపర్ క్యాచ్‌తో ఔట్ అయ్యాడు. క్రీజ్‌లోకి అక్షర్ పటేల్ వచ్చిన కాసేపటికి మ్యాచ్‌కు వరుణుడు కాస్త అంతరాయం కలిగించాడు. అయితే 14 నిమిషాల్లోనే ఆట పునఃప్రారంభం అయింది. మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం భారత్ స్కోరు 11 ఓవర్లకు 35/3గా ఉంది. క్రీజ్‌లో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.

Exit mobile version