Rishi Sunak : భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా తేలింది. సునాక్ భార్య అక్షత మూర్తికి పలు చైల్డ్ కేర్ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని సునాక్ వెల్లడించలేదు. దీంతో తన భార్యకు ఉన్న షేర్ల విషయం చెప్పకుండా రిషి సునాక్ పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించారని విపక్షలు ఆరోపించాయి. ఈ చైల్డ్ కేర్ పథకాలతో అక్షత మూర్తి లబ్ధి పొందుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే దీనిపై ఏప్రిల్‌లో పార్లమెంట్ కమీషనర్ ఫర్ స్టాండర్డ్స్ దర్యాప్తు ప్రారంభించింది. చట్టసభ సభ్యుల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షించే కమిషనర్ డేనియల్ గ్రీన్‌బర్గ్ ఆధ్వర్యంలో కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది.
Also Read: Life Tax On EV’s: ఎలక్ట్రిక్ వాహనాలకు ఇకపై ఆ పన్ను కట్టాల్సిందే.. మినహాయింపుకు ఇక సెలవు
అయితే దీనిపై మీడియా గ్రీన్ బర్గ్ ను ప్రశ్నించగా నిబంధనల్లో ఉన్న గందరగోళం కారణంగానే అలా జరిగిందని ఆయన తెలిపారు. తనకు వద్ద ఉన్న సమాచారం ప్రకారం కోడ్ ఉల్లంఘన తెలియక జరిగిందే తప్ప దీని వెనుక ఎలాంటి ఉద్దేశ్యాలు లేవన్నారు. కావాలని తన భార్య షేర్లను సునాక్ తెలపకుండా ఉండలేదని గ్రీన్ బర్గ్ పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను సునాక్ కమిటీకి అందించారు. దాంతో సంతృప్తి చెందిన కమిటీ విచారణను ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదని దీనిని ఇక్కడితో ఆపేస్తున్నట్లు పేర్కొంది. అయితే సునాక్ ఈ విషయాన్ని సీనియర్ ఎంపీలకైనా చెప్పి ఉంటే బాగుండేదని గ్రీన్ బర్గ్ అభిప్రాయపడ్డారు. అయితే సునాక్ దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పారని తెలిపిన గ్రీన్ బర్గ్ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించే చట్టసభ సభ్యులను సస్పెండ్ చేయడం లేదంటే పార్లమెంటు నుంచి బహిష్కరించే అధికారం కూడా ఈ కమిటీకి ఉంటుంది. అయితే ఈ కమిటీ విచారణ ముగిసిందని చెప్పడం, ఎటువంటి చర్యలు లేవని చెప్పడం గమనార్హం. ఇక రిషి సునాక్ తాను రిజిస్ట్రేషన్, డిక్లరేషన్ విధానంలో గందరగోళానికి గురయ్యానంటూ పేర్కొంటూ గ్రీన్ బర్గ్ కమిటీకి లేఖ రాశారు. తెలియకుండా నిబంధనలు ఉల్లంఘించడం జరిగిందని, అందువల్ల తనని క్షమించాలని సునాక్ కోరారు. అంతేకాకుండా ఎటువంటి చర్యలు లేకుండా ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నందుకు ఆయన కమిటీకి థ్యాంక్స్ చెప్పారు.