ఎక్కడో మారుమూల తాండా నుంచి వచ్చిన బలరాం నాయక్ కు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దండులు ఉన్న నల్లగొండ జిల్లాలో శంకర్ నాయక్ కు జిల్లా అధ్యక్షుడుగా కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. ఇది కాంగ్రెస్ గిరిజనులకు ఇచ్చిన గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ఈ ఎనిమిదేళ్ల పాలనలో టీఆరెస్, బీజేపీ గిరిజనులకు ఏమిచ్చాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ గిరిజనులకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
కొత్త సీసాలో పాత సారాలా టీఆర్‌ఎస్, బీజేపీ ప్రజల ముందుకు వస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నపుడు రాజగోపాల్ రెడ్డి ఏం వెలగబెట్టారని ఆయన ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా మంత్రిగా ఉన్న మూడడుగుల జగదీష్ రెడ్డి గిరిజనులకు ఏం చేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు. స్రవంతిని గెలిపిస్తే పోడు భూముల సమస్యపై కోట్లాడి పట్టాలు ఇప్పించే బాధ్యత మాదని, మోదీ అయినా కెడీ అయినా.. కొట్లాడి పోడు భూములకు పట్టాలిప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. నన్ను మాల్కాజ్ గిరిలో గెలిపించినట్లుగానే… మునుగొడులో స్రవంతిని గెలిపించండని ఆయన కోరారు. ఈ పార్టీ మీది… చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించండని ఆయన ప్రజలను కోరారు.