NTV Telugu Site icon

Revanth Reddy : ఎమ్మెల్సీ కవిత స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయాలి.. ఎవరు ఆఫర్ ఇచ్చారో తెలుసుకొని అరెస్ట్‌ చేయాలి

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణలో ఒక్కసారి రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ రోజు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. అదే సమయంలో.. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్‌ తన కూతురు కవితను సైతం బీజేపీలోకి రావాలని కోరారని.. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా ఎమ్మెల్సీ కవిత సైతం తనను పార్టీ మారాలని కోరారని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. కవిత వ్యాఖ్యలపై తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Also Read : YS Jagan Mohan Reddy: సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోవాలి.. ఆ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్..
పార్టీ మారాలని బీజేపీ నేతలు సంప్రదించారని కవిత ఒప్పుకున్నారని, కవితను సిట్‌ ఆఫీస్‌కు పిలిచి ఎవరు పార్టీ మారమన్నారో స్టేట్‌‌మెంట్ రికార్డు చేయాలని కోరారు రేవంత్‌ రెడ్డి. ఎమ్మెల్యేలకు ఎర కేసు తరహాలో దర్యాప్తు చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై అధికారులను ఉపయోగించుకొని కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్‌ రెడ్డి. ప్రజలందరూ ఈ రెండు పార్టీల గురించి చర్చించుకోవాలనే వ్యూహాత్మక కుట్రలో భాగంగానే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి.