CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం రైతులు, పేదలకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. పేదలు కష్టపడి సంపాదించుకున్న ఇళ్లు, స్థలాలు ఇబ్బందుల్లో పడకుండా సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, పేదల ఇళ్లను ఉద్దేశపూర్వకంగా కూల్చుతున్నారంటూ కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారంపై కూడా చర్చిస్తానని తెలిపారు.
నిషేధిత భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. 22A భూముల విషయంలో ప్రజల్లో ఉన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను సభ వేదికగా వివరించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను కూడా చర్చలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 22A భూముల అంశంపై గతంలోనూ తప్పుగా చేర్చిన భూములను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
మరోవైపు రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల ఎదురవుతున్న విద్యుత్, నీటి సమస్యలపై కూడా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒక్క రోజులోనే విద్యుత్ వినియోగం 19000 MW పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎల్‌నినో తీవ్రత ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. అలాగే చరిత్ర కొంతమందిని ఎప్పుడూ క్షమించదని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన తప్పిదాలపై చర్చ జరిగితేనే భవిష్యత్తులో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని అన్నారు. అయితే ప్రతిపక్షం గతంలో జరిగిన తప్పిదాలపై చర్చించేందుకు సిద్ధంగా లేక సభ నుంచి బయటకు వెళ్లిందని విమర్శించారు.
విద్యుత్ కొరత రావాలని కొందరు క్షుద్ర పూజలు చేశారనే అంశం కూడా సభలో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై చర్చ జరుగుతుందనే భయంతోనే ప్రతిపక్షం సభ నుంచి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డను సమానంగా గౌరవిస్తుందని సీఎం అన్నారు. ఎమ్మెల్యే అయినా, సామాన్య మహిళ అయినా గౌరవంగా చూడాల్సిందేనని స్పష్టం చేశారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు వికృతంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు.
స్పీకర్ పదవికి సభ ఆమోదం లభించిన తర్వాత.. ఆ చైర్‌కు అన్ని సభ్యుల హక్కులను సమానంగా కాపాడే బాధ్యత ఉంటుందని తెలిపారు. శాసనసభ నిర్వహణకు సంబంధించిన నిబంధనలు గత ప్రభుత్వ హయాంలోనే రూపొందించారని సీఎం గుర్తుచేశారు. నినాదాలు లేదా రాజకీయ సందేశాలు ఉన్న దుస్తులతో సభకు రావద్దని గతంలోనే శాసనసభలో నిబంధనలు ఆమోదించారని రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ నిబంధనలకు సభ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
పోలీసు అధికారులు తమ విధులను నిర్వహిస్తారని, స్పీకర్ ఆదేశాలను అమలు చేయడం వారి బాధ్యత అని సీఎం చెప్పారు. పార్లమెంట్‌లో ఉన్న నిబంధనలు అక్కడ, అసెంబ్లీలో ఉన్న నిబంధనలు ఇక్కడ అమలవుతాయని స్పష్టం చేశారు. ఇటీవల నినాదాలతో కూడిన టీషర్టులు ధరించిన బీఆర్‌ఎస్ సభ్యులను అసెంబ్లీ వద్ద పోలీసులు అడ్డుకున్న ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
సభా పోడియంలోకి వస్తే సభ్యుడిని సస్పెండ్ చేసే నిబంధన ఉన్నప్పటికీ, గతంలో సభ్యులను గౌరవించి క్షమించామని సీఎం అన్నారు. వారికి సభలో మాట్లాడేందుకు మైక్ కూడా ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ సభలో సభ్యులను, సభ వెలుపల స్పీకర్‌ను దూషించే పరిస్థితులు ఏర్పడ్డాయని వ్యాఖ్యానించారు. సభలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందేమోనని భావించి మరోసారి మాట్లాడే అవకాశం ఇచ్చినా అదే విధమైన పరిస్థితి కొనసాగిందని, చివరకు సస్పెన్షన్ చేయాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
ధరణి వ్యవహారంలో భారీ స్థాయిలో ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్లాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తే రామాయణం అంత ఉంటుందని, చెబితే భారతం అంత ఉందని వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమైన అంశాలను సభలో ప్రస్తావించి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తానని చెప్పారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డిపై కొందరు ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని సీఎం అన్నారు. ఆయన ముక్కుసూటి మనిషి కావడంతో కొంతమందికి కోపం వచ్చిందని వ్యాఖ్యానించారు. శ్రీనివాస్ రెడ్డిపై ఒక రాజకీయ భూతాన్ని సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పిదాలకు కారణమైన అంశాలను సభలో చర్చించి, వాటిపై తగిన సూచనలు ఇస్తే ప్రభుత్వం పరిష్కారం చూపేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

